
పంతొమ్మిది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణం ఇప్పుడు ఏడుగురి దగ్గర ఉంది. వీరిలో ఒకరికి నేరుగా ఫినాలేలో పాగా వేసేందుకు బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరి ఎక్కువ పాలు సేకరిస్తే వారికి టికెట్ ఇచ్చేస్తానని చెప్పాడు. ఆ టికెట్ దక్కించుకునేందుకు ఇంటిసభ్యులు నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతున్నారు. ఇదేమీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కాదు, ఏదైనా యాడ్ ప్రమోషన్స్ కోసం ఇచ్చిన టాస్క్ అంతకన్నా కాదు. ఎవరికి వారు సొంతంగా ఆడాల్సిన అత్యంత కీలకమైన గేమ్. కానీ దీన్ని కూడా కొందరు కలిసి ఆడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో అభిజిత్ ఇదే సందేహాన్ని లేవనెత్తాడు. అఖిల్ సోహైల్ కలిసి ఆడుతున్నారా? అని ప్రశ్నించాడు. దానికి అఖిల్ తెలివిగా సమాధానమిస్తూ.. 'నీకు ఓ కప్పిచ్చాను.. ఫస్ట్ నువ్వు పట్టుకో, తర్వాత నేను పట్టుకుంటా అని చెప్పాను. అది కూడా కలిసి ఆడటమేనా? అని అడుగుతూనే ఇది కలిసి ఆడటం కాదు కదా, అలాగే సోహైల్‌కు ఏదో కావాలంటే ఇస్తున్నా' అని జవాబిచ్చాడు. అతని సమాధానం విని అభి షాకయ్యాడు. (చదవండి: దండం పెడతా, గేమ్ ఆడండి: నాగార్జున)
ఇకపోతే అఖిల్, సోహైల్ మిగతావారికి పాలు దక్కించుకునేందుకు ఏమాత్రం సందివ్వట్లేదు. దీంతో అరియానా ఫైర్ అవుతూ మొత్తం మీరే పట్టేసుకుంటూ మిగతావారికి ఏం లాభం? అని సీరియస్ అయింది. అటు హారిక తనకు అదృష్టం కలిసొస్తుందేమోనని నోయల్ టీషర్ట్‌నే ధరించింది. చివరిసారి ఈ టీ షర్ట్ ధరించినప్పుడే ఆమె కెప్టెన్ అయింది. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఫినాలే టికెట్ ఇచ్చేందుకు మరీ ఇలాంటి టాస్క్ ఇస్తారా? అని విమర్శిస్తున్నారు. అభిజిత్‌కు సపోర్ట్ చేసినందుకు హారికను ఫేవరెటిజమ్ చూపిస్తుందన్నారు. మరి అఖిల్, సోహైల్ చేస్తున్నదేంటని నిలదీస్తున్నారు. వీళ్లకు ఇక్కడ కూడా ఒంటరిగా ఆడటం చేతకాదని విమర్శిస్తున్నారు? రెండో సీజన్‌లో కౌశల్‌కు వ్యతిరేకంగా తనీష్, సామ్రాట్ కలిసి ఆడితే చివరికి ఏమైందో ఓసారి గుర్తు చేసుకొమ్మని మరికొందరు సెటైర్లు విసురుతున్నారు. మొత్తానికి ఈ రేసు నుంచి అవినాష్, మోనాల్, అరియానా అవుట్ అవగా మిగిలిన నలుగురు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment