బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైందంటే వినోదానికి ఢోకా లేనట్టే. కానీ ఈ నాల్గో సీజన్ మాత్రం ప్రారంభంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుని జనాలను తిరిగి తనవైపుకు తిప్పుకుంటోంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఇంకా గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఐయామ్ బోల్డ్, స్ట్రాంగ్ అంటూ వీరవనితలా మాట్లాడిన అరియానా ఇంటిసభ్యులందరూ తనపై నామినేషన్ అనే అస్త్రాన్ని వదలగానే మన్ను తిన్న పాములా మారిపోయింది. తన అల్లరితో ఇల్లు పీకి పందిరి వేసే ఆమె ఇప్పుడు హౌస్‌లో ఉందా? లేదా? అన్నట్లుగా ఉంది. అటు అవినాష్ కూడా నోయల్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాడు.
ఫిజికల్ టాస్కు అంటే మెహబూబ్ ఉండాల్సిందే
ఇక కెప్టెన్సీ కోసం కొట్టుకు చచ్చిన అఖిల్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్టే వెళ్లి సీక్రెట్ రూమ్‌లో పాగా వేశాడు. ఇప్పుడిప్పుడే తన మీద ఉన్న మచ్చలను తుడిపేసుకుంటూ మోనాల్ సరైన ట్రాక్ ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సోహైల్ చెప్పినట్టుగానే అభిజిత్ ఐడియాలు ఇస్తాడు కానీ ఏమీ చేయడని అతడే స్వయంగా రుజువు చేసుకుంటున్నాడు. జున్నును గుర్తు చేసుకుంటూ పదేపదే బాధపడుతున్న లాస్య హౌస్‌లో వంటింటి కుందేలుగా మారిపోయింది. హారిక అయితే అభి, లాస్యతో లేదంటే కెమెరాలతో మాట్లాడుతూ పొద్దు గడుపుతోంది. ఫ్రెండ్‌షిప్పే తన బలం అనుకుంటున్న సోహైల్‌కు అదే బలహీనంగా మారుతోంది. మిగిలింది మెహబూబ్.. మొదట్లో కాస్త అతిగా ప్రవర్తించి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. కానీ తర్వాత మామూలుగానే ఉన్నాడు. అయినా సరే అతడిపై వ్యతిరేకత మాత్రం పోలేదు. అయితే ఫిజికల్ టాస్కులో చావోరేవో అన్నట్లుగా పోరాడుతాడు. ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తాడు. (చదవండి: హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్)
రీఎంట్రీ, ఎలిమినేషన్.. ఏదో ఒకటేనా?
వీరిలో ఒకరు బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయం వచ్చింది! పదోవారానికిగానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, మోనాల్, హారిక ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, ఆ తర్వాత మోనాల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. దీపావళి సందర్భంగా ఎలిమినేషన్ రద్దు చేస్తే మెహబూబ్ మరోసారి అదృష్టవంతుడని నిరూపించుకున్నట్లే. ఎందుకంటే హౌస్‌ను వీడనుంది మెహబూబ్ అని సోషల్ మీడియా పోల్స్ ఘంటాపథంగా చెప్తున్నాయి. మరోవైపు సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్ నేడు హౌస్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. రీ ఎంట్రీ ఉండటంతో పాటు పండగ స్పెషల్ అంటూ ఎలిమినేషన్ ఉంచుతారా? ఎత్తేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: బిగ్‌బాస్‌కు తలనొప్పిగా మారుతోన్న మెహబూబ్!)
Comments
Please login to add a commentAdd a comment