'మాస్ట‌ర్‌' ప్లాన్‌: ఇక హారిక‌, అభిల‌కు చుక్క‌లే.. | Bigg Boss 4 Telugu: Amma Rajasekhar New Rules As Captain | Sakshi
Sakshi News home page

హిట్ల‌ర్ రూల్స్‌: ఎవ‌డిని బెదిరిస్తున్నాడు? హారిక ఫైర్‌

Published Fri, Nov 6 2020 11:26 PM | Last Updated on Sat, Nov 7 2020 8:12 AM

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar New Rules As Captain - Sakshi

'ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో' టాస్కులో న‌వ్వుతూ ఉన్న అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అవ‌గానే ఊస‌ర‌వెల్లిలా రంగులు మార్చాడు. పాత గొడ‌వ‌ల‌ను మ‌నుసులో పెట్టుకుని త‌నకు గిట్ట‌నివాళ్ల మీద ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. సోహైల్‌ నా ఫ్రెండు నా ఫ్రెండూ అని జ‌బ్బ‌లు చ‌రిచే మెహ‌బూబ్ మాస్ట‌ర్‌తో జ‌త క‌ట్టాడు. ఇంకేముందీ ఆయ‌న వేసిన‌ ప్లానులో చిక్కుకున్న మెహ‌బూబ్‌ నీ ఫ్రెండ్‌షిప్ వ‌ద్దంటూ సోహైల్‌కు సినిమా చూపించాడు. అఖిల్‌.. మోనాల్ అనే కంటెస్టెంటు ఇంట్లో ఉంద‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయిన‌ట్టున్నాడు. మ‌రి నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

మోనాల్ ఎలా చేస్తుందో నాకు తెలుసు: అభిజిత్‌
"రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ రింగులో క‌ళ్ల‌కు గంత‌లు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒక‌రికి మ‌రొక‌రు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్ట‌ర్ హారిక మీద ప‌డి ఆమె టీషర్ట్‌ను ఎరుపురంగు మ‌యం చేశాడు. అరియానా మీద కూడా రంగు ప‌డింది. అస‌లు రంగు ప‌డ‌కుండా త‌ప్పించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అయ్యాడు. ఒక్కొక్క‌రికి త‌న త‌డాఖా చూపిద్దామ‌ని ఫిక్స‌య్యాడు. ఇంగ్లీషులో మాట్లాడితే జైలులో వేస్తాన‌న్నాడు. అలా అన్నాడో లేదో బిగ్‌బాస్ జైలు తాళాలు పంపించ‌డం గ‌మ‌నార్హం. అవినాష్‌ను రేష‌న్ మేనేజ‌ర్‌గా నియ‌మించాడు. త‌ర్వాత క్యారెట్ హ‌ల్వా చేయ‌మ‌ని బిగ్‌బాస్‌ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మోనాల్‌, లాస్య చెఫ్‌లుగా అవ‌తార‌మెత్తి హ‌ల్వా చేశారు. నాకు మోనాల్ చేతి వంట ఎలా ఉంటుందో తెలుసు, లాస్య‌క్క‌నే బాగా చేస్తుంద‌ని అభిజిత్ రుచి చూడ‌క‌ముందే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు. కానీ కెప్టెన్ మాత్రం ఇద్ద‌రినీ విజేత‌లుగా ప్ర‌క‌టించాడు.

కెప్టెన్ కొత్త రూల్స్‌: దిమ్మ‌తిరిగిపోయింది
ఇక కెప్టెన్ అమ్మ రాజ‌శేఖ‌ర్ ఇంట్లో కొత్త నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెట్టాడు. మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డట్టు ప‌ని చేసేవాళ్ల‌కు మ‌రిన్ని ప‌నులు అప్ప‌గించాడు. అరియానాను ఏ ప‌నీ చేయ‌నీయ‌కుండా త‌న‌ అసిస్టెంటుగా నియ‌మించుకున్నాడు. మైకు మ‌ర్చిపోతే జైలుకు పంపిస్తానన్నాడు. నిద్ర పోతే బెడ్‌రూమ్ మొత్తం శుభ్రం చేయాల‌ని ఆదేశించాడు. ఇంగ్లీషులో మాట్లాడితే త‌న‌కు న‌చ్చినంత సేపు నిల‌బెడ‌తాన‌న్నాడు. మైకుల బ్యాట‌రీ కోసం బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు స్టోర్ రూమ్‌లోకి చిట్ట చివ‌ర వ‌చ్చిన‌వారి వారి గుడ్డు మొద‌ట అడుగు పెట్టిన వాళ్ల ఖాతాలోకి వెళుతుంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ రూల్స్ చూసి ఇంటిస‌భ్యులు గుడ్లు తేలేశారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌కు త‌ల‌నొప్పిగా మారుతోన్న మెహ‌బూబ్‌!)

హౌస్‌లో మ‌హానాట‌కానికి తెర దీసిన మాస్ట‌ర్‌
మెహ‌బూబ్‌, అవినాష్ బాత్రూమ్‌ క్లీన్ చేస్తార‌ని మిగిలిన‌ ప‌నుల‌న్నీ మిగ‌తావాళ్ల‌పై భారం వేశాడు. దీంతో షాకైన‌ ఇంటిస‌భ్యులు తాము చేయ‌మ‌ని తేల్చి చెప్పారు. ఎవ‌డిని బెదిరిస్తున్నాడు? కెప్టెన్ అంటే హిట్ల‌ర్ డ్యూటీ కాదు అని హారిక మండిప‌డింది. ఈ క్ర‌మంలో హౌస్‌లో పెద్ద ర‌భ‌స చోటు చేసుకోవ‌డంతో మెహ‌బూబ్‌, అవినాష్ మ‌రికొన్ని ప‌నులు చేసేందుకు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చారు. ఇది మాస్ట‌ర్‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌లేదు. పైగా ఈ గొడ‌వ పురాణాన్ని ప్లాన్ చేసిన మాస్ట‌ర్ త‌న‌కు అంద‌రూ స‌మాన‌మే అంటూ నాట‌క‌మాడ‌టం కొస‌మెరుపు. ఎవ‌రూ గొడ‌వ‌ప‌డొద్దు అని నీతిసూక్తులు వ‌ల్లించాడు. కానీ ప‌క్క‌కు వెళ్లి మెహ‌బూబ్‌, అవినాష్‌ల‌కు క్లాసు పీకాడు. వేరే ప‌నులు చేస్తామ‌ని ఎందుకు ఒప్పుకుంటున్నార‌ని తిట్టిపోశాడు. (చ‌ద‌వండి: కాపురాలు కూలిపోతాయ్ అట‌!: హిమ‌జ‌)

అభిజిత్‌ను శిక్షించిన మాస్ట‌ర్‌
ఓవైపు గొడ‌వ‌ల‌ద్ద‌ని చెప్తూనే మాస్ట‌ర్ కావాల‌ని అభిజిత్‌ను టార్గెట్ చేసి త‌గాదా పెట్టుకున్నాడు. దీని గురించి అభి త‌న టీమ్‌తో మాట్లాడుతూ ఎన్నిసార్లు ఊరుకోవాలి అని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఫ్ర‌స్టేష‌న్‌లో పొర‌పాటున‌ రెండు ఇంగ్లీషు ముక్క‌లు మాట్లాడాడో లేదో తెలుగులో మాట్లాడాల‌ని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అది వినిపించ‌డంతోనే బుస‌లు కొడుతున్న పాములా మాస్ట‌ర్ వెంట‌నే లేచి చ‌ప్ప‌ట్లు కొడుతూ విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు. త‌ను చెప్పేంత‌వ‌ర‌కు నిల‌బ‌డ‌మ‌ని ప‌నిష్మెంట్ ఇచ్చాడు. (చ‌ద‌వండి: రెచ్చిపోయిన నోయ‌ల్‌; ఆ ఇద్ద‌రికీ వాచిపోయిందంతే!)

మాస్ట‌ర్ ఉచ్చులో ప‌డిపోయిన మెహ‌బూబ్‌
మ‌రోవైపు మాస్ట‌ర్ రూల్స్ వ‌ల్ల సోహైల్‌, మెహ‌బూబ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. అయితే వాటిని తేలిక‌గా తీసుకున్న సోహైల్ స్నేహితుడికి చాక్లెట్ చేయికందించాడు. కానీ మెహ‌బూబ్ మాత్రం నీ ఫ్రెండ్‌షిప్‌ వ‌ద్దు, ఏం వ‌ద్దు, నా ఆట ఆడుకుంటా అనేశాడు. అంతే.. సోహైల్‌కు తిక్క లేచింది. ఫ్రెండ్‌షిప్ వ‌ద్దు అన్న‌ మాట‌తో అత‌నికి న‌రాలు క‌ట్ట‌యిపోయాయి. చేతికి అందిన వ‌స్తువున‌ల్లా విసిరిపారేశాడు. దీంతో అఖిల్.. సోహైల్‌ ద‌గ్గ‌ర‌కు వెళ్లి బుజ్జ‌గించి ఇద్ద‌రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌ర్వాత మైక్‌ బ్యాట‌రీలు మార్చుకోమ‌ని బ‌జ‌ర్ మోగింది. ఎక్క‌డ గుడ్డు పోతుందోన‌ని ఇంటిస‌భ్యులు ప‌రుగెత్తుకుంటూ వెళ్లారు. మొద‌ట అవినాష్ వెళ్ల‌గా, చివ‌ర‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్ తాపీగా న‌డుచుకుంటూ వెళ్లాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement