బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి షోపై ప్రేక్షకులకు ఒక ఫిర్యాదు ఉంది. అదేంటంటే చాలామంది ఇది తెలుగు బిగ్‌బాస్ అన్న విషయాన్ని మర్చిపోతూ నానా భాషలు మాట్లాడేస్తున్నారు. మొదట్లో గుర్రు పెట్టి నిద్రపోయిన బిగ్‌బాస్ దీన్నంతగా పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ ఇంగ్లీష్ పీస్ మా వల్ల కాదంటూ నెటిజన్లు తమ గోడు ఏకరువు పెట్టారు. దీంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను హెచ్చరించాడు. కానీ ఇప్పటికీ కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. గుజరాతీ భామ మోనాల్ కష్టపడి ఇష్టంతో తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంటే తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టి పెరిగిన ఓ ఇద్దరు మాత్రం ఎప్పుడు చూసినా ఇంగ్లీషులోనే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. చక్కగా తెలుగులో మాట్లాడకుండా, ఇదేం గోల, వీళ్ల ఓవర్ యాక్షన్ వల్ల ఎపిసోడ్ చూడాలంటేనే విసుగు వస్తోందంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్‌లో ఏడుగురు)
ఈ విషయం నాగ్ చెవిన కూడా పడినట్లు కనిపిస్తోంది. ఇంగ్లీషులో మాట్లాడినందుకు హారిక, అభిజిత్ మీద నాగ్ గరమయ్యారు. తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాట్లాడుతున్నారని క్లాస్ పీకారు. కాగా అభిజిత్ తెలుగులో మాట్లాడుతున్నా హారిక ఇంగ్లీషులో ముచ్చట ప్రారంభించడంతో అతను కూడా తెలుగును పక్కన పెట్టేస్తున్నాడు. నిజానికి హారిక తెలంగాణ యాసతో వీడియోలు చేయడం వల్లే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. హౌస్‌లోనూ తన యాసతో అందరినీ మెప్పిస్తుందనుకుంటే యాస కాదు కదా తెలుగునే పక్కనపెట్టేసి అభిమానులను కూడా నిరుత్సాహపరుస్తోంది. మరి ఇప్పటికైనా ఈ ఇద్దరు కంటెస్టెంట్లు నాగ్ మాటను చెవినెక్కించుకుంటారో, లేదోనని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోజు కోసం ఎంతలా వేచి చూశామోనంటూ మరికొందరు సంతోషపడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అదృష్టాన్ని కాలితో తన్నేశాడు)
Comments
Please login to add a commentAdd a comment