Bigg Boss Telugu 5, Episode 61: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హీరోల టీమ్ నుంచి ఒకరిని టార్గెట్ చేసే ఛాన్స్ విలన్స్‌కు వచ్చింది. దీంతో వారు అవతలి టీమ్‌లో ప్రియాంక సింగ్‌ను సెలక్ట్ చేసుకున్నారు. ఆమెతో ఐ క్విట్ అని చెప్పించడానికి ముప్పు తిప్పలు పెట్టారు. గుడ్డు అంటే పడని పింకీ పచ్చి గుడ్డు రసాన్ని గటగటా తాగేసింది. పేడనీటితో స్నానం చేసింది. వాసన చూస్తేనే వాంతింగ్ వచ్చే మరో జ్యూస్‌ను తాగింది. ఉల్లిపాయ అంటేనే నచ్చకపోయినా టాస్క్ కోసం దాన్ని కరకరా నమిలేసింది. ఇక హెయిర్ కట్ చేసుకోమని సిరి కత్తెర ఇవ్వగా.. పింకీ ఓ క్షణమాగింది. క్యాన్సర్ పేషెంట్ల కోసం తాను జుట్టు పెంచుతున్నానని, కానీ ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పడంతో సిరి వెనకడుగు వేసింది. అనంతరం ఎగ్, పెయింట్ కలగలిపిన ద్రవాన్ని ముఖానికి పూసుకుంది. మరెన్నో టాస్కులివ్వగా ఆమె వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసి తను కూడా గేమ్‌లో ఉన్నానని నిరూపించింది.
నాతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా చెప్పమని షణ్నుని అడిగింది సిరి. దానికతడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడతానని బదులివ్వగా అప్పుడు నువ్వు మాట్లాడినా నాకవసరం లేదని తేల్చేసింది సిరి. మరోపక్క షణ్ను.. ఓ వైపు జెస్సీని తన టీమ్‌లోకి లాగడానికి ప్రయత్నిస్తూనే, టాస్క్‌లో గొడవలవుతాయని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సిరికి సూచించాడు. తర్వాత ఎప్పటిలాగే సారీ చెప్పడమే కాక 10 గుంజీలు తీశాడు. తర్వాత అందరికీ వినబడేలా సారీ అని గట్టిగా చెప్పడంతో ఆమె అలక మాయమైపోగా వెళ్లి షణ్నుని గట్టిగా హత్తుకుంది.
ఇక కాజల్ గార్డెన్ ఏరియాలో పెట్టిన బాక్స్‌కు ఉన్న తాళాలు ఓపెన్ చేయడానికి వీల్లేకుండా అందులో గోధుమపిండి నింపింది. ఈ దిక్కుమాలిన ఆలోచనలు మాకు రావా? అంటూ ఫైర్ అయింది అవతలి టీమ్‌లోని సిరి. ఇరు టీమ్‌లకు బిగ్‌బాస్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు. ఒకరి టీమ్‌లోని వ్యక్తిని అవతలి టీమ్ మెంబర్‌తో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. స్వాప్ అనేది ఒక అవకాశం మాత్రమేనని, ఆదేశం కాదన్నారు విలన్స్. లేదు, చేసి తీరాల్సిందేనన్నాడు షణ్ను. ఈ క్రమంలో షణ్ను, సన్నీకి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత హీరోలు.. విలన్స్ టీమ్‌లో నుంచి యానీని టార్గెట్ చేసి ఆమెకు వరుసగా మూడు డ్రింకులు ఇచ్చారు. ఘాటు మిర్చిని తినిపించారు. పెయింట్ పూసుకునేలా చేయడమే కాక పేడ కలిపిన ఐస్ వాటర్‌తో స్నానం చేయించారు. అన్నింటినీ కంప్లీట్ చేసి యానీ అదుర్స్ అనిపించింది.
అందరి ముందూ సిరిపై అరుస్తున్నావని జెస్సీ షణ్నును హెచ్చరిస్తాడు. దానికతడు.. సంచాలకుడిగా అందరి మీదా అరుస్తానని, కావాలంటే నామినేట్ చేయండి, వరస్ట్ పర్ఫామర్ ఇవ్వండని చెప్తాడు. అందరి ముందూ సిరికి సారీ చెప్పాను, గుంజీలు తీశాను, అది లెక్కలోకి రాదు కదా అని ఫైర్ అయ్యాడు. నువ్వెన్ని మాటలు అన్నా పడాలి, జెన్యున్‌గా ఆడట్లేదంటే నాకెలా ఉంటుంది? ముందు నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడు అంటూ నిప్పులు చెరిగింది సిరి.
తర్వాత విలన్లు రాక్షసావతారం ఎత్తి ఇల్లంతా చిందరవందర చేశారు. సిరి బట్టలన్నీ విసిరిపారేసింది. దీంతో రంగంలోకి దిగిన కెప్టెన్ ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని ప్రశ్నించడంతో ఆమె ఇన్నర్స్ సర్దేయడానికి ఒప్పుకుంది. కాకపోతే తన వేళ్లు పని చేయడం లేదని, 2 నిమిషాలు ఆగమని చెప్పింది. అందుకు అంగీకరించని షణ్ను.. ఆ పని ఇప్పుడే చేసి తీరాలని ఆదేశించాడు. అతడి ఆజ్ఞతో చిర్రెత్తిపోయిన సిరి.. తీయనని తేల్చి చెప్పగా ఇది నీ క్యారెక్టర్.. అని నోరు జారాడు షణ్ను. బట్టలు తీయడానికి, క్యారెక్టర్‌కు సంబంధం లేదని మండిపడుతూనే ఏడ్చేసింది సిరి. ఈ దెబ్బల కన్నా నువ్వనే మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
ఇది చూసిన పింకీ.. ఎవడు పెట్టుకోమన్నాడు అంత గ్రీజు అని సిరిపై సెటైర్లు వేసింది. దెబ్బకు షాకైన మానస్.. పింకీ, నీకు నోటిదూల ఎక్కువగా ఉంది, నిన్న నువ్వు ఏడ్చినప్పుడు కూడా అందరూ అలాగే అనుకుంటారు. నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పు అని చెప్పుకొచ్చాడు. నీకేవరైనా హాని చేయాలనుకుంటే నాశనం అయిపోవాలి అని కోరుకుంటావు, అది నీ ఆలోచనా విధానం అని చెప్పడంతో పింకీ నోరెళ్ల బెట్టింది. ఎవరి బాధను కూడా జోక్ చేయొద్దని హితవు పలికాడు మానస్.
Comments
Please login to add a commentAdd a comment