బిగ్‌బాస్ హౌస్‌లో కాటు వేసే నాగిణి ఎవ‌రో తెలుసా? | Bigg Boss 5 Telugu: These Two Contestants Are Nagini And Snake | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: కాజ‌ల్ గాడిద, లోబో దున్న‌పోతు, ఇక ష‌ణ్ముఖ్‌...

Published Sat, Oct 30 2021 11:21 PM | Last Updated on Sat, Oct 30 2021 11:23 PM

Bigg Boss 5 Telugu: These Two Contestants Are Nagini And Snake - Sakshi

Bigg Boss Telugu 5, Episode 56: బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌కు పూరీలు చేసే టాస్క్ ఇచ్చాడు. యానీ మాస్ట‌ర్, శ్రీరామ్‌, విశ్వ‌, ర‌వి, లోబో ఒక టీమ్ కాగా మిగిలిన‌వారంతా మ‌రో టీమ్‌. ఈ గేమ్‌లో కాజల్ టీమ్ ముందుగా 50 పూరీలు చేసిన‌ప్ప‌టికీ అవి స‌రిగా లేవంటూ సంచాల‌కుడు ష‌ణ్ను యానీ టీమ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించాడు. దీంతో గెలిచిన టీమ్ స‌భ్యులంద‌రికీ ఏడాది పాటు వంట‌నూనె ఉచితంగా ల‌భించే ఆఫ‌ర్ అందుకున్నారు. అయితే కాజ‌ల్ వాళ్లు క‌ష్ట‌ప‌డి త్వ‌ర‌గా పూరీలు చేశార‌ని స‌న్నీ జైల్లో నుంచి త‌న ఒపీనియ‌న్ చెప్పాడు.

దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. 'బుద్ధుండాలి, మ‌ధ్య‌లో నీ జ‌డ్జిమెంట్ ఏంటి? న్యూట్ర‌ల్‌గా మాట్లాడు' అని వేలెత్తి చూపుతూ రెచ్చిపోయింది. సౌతిండియ‌న్‌, నార్తిండియ‌న్ అంటూ వీళ్లిద్ద‌రూ ఎక్క‌డెక్క‌డికో వెళ్లిపోయారు ఈ గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌లా మార‌గా విసిగిపోయిన స‌న్నీ చెంప‌లేసుకున్నాడు. వీళ్లిద్ద‌రికీ గొడ‌వ జ‌రుగుతుంటే ష‌ణ్ను న‌వ్వాపుకోలేక‌పోయాడు. ఒక‌ప‌క్క హౌస్ అంతా ఆవేశంతో ఊగిపోతుంటే కెప్టెన్ మాత్రం దాన్ని ఎంజాయ్ చేస్తూ న‌వ్వ‌డ‌మేంట‌ని ఫైర్ అయ్యాడు స‌న్నీ. 'హౌస్‌లో కొంద‌రు బాధ‌ప‌డుతుంటే నీకు న‌వ్వొస్తుంది, అది త‌ప్పు' అని నొక్కి చెప్పాడు. ఆ మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని ష‌ణ్ను త‌న న‌వ్వును కంటిన్యూ చేస్తూ స‌న్నీని మ‌రింత రెచ్చ‌గొట్టాడు.నువ్వు కొడ‌తానంటే కొట్టు, వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

ఈ గొడ‌వ‌ల‌తో హౌస్ అంతా హీటెక్కిపోగా వారికి కూల్ చేసేందుకు స్టేజీపై ఎంట‌ర‌య్యాడు నాగార్జున‌. ర‌వి.. డ‌బ్బుల గురించి రాలేద‌ని, నా భార్యాపిల్ల‌లు ఎలా ఉన్నారో చెప్పండ‌ని, లేదంటే బిగ్‌బాస్ నుంచి పంపించివేయండి అని మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు నాగ్‌. నువ్వు వెళ్లిపోతానంటే చెప్పు గేట్లు ఓపెన్ చేయిస్తాన‌ని హెచ్చరించాడు. కెప్టెన్సీ టాస్క్‌ను మ‌ధ్య‌లో వదిలేసిన‌ యానీ మాస్ట‌ర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు? అని ప్ర‌శ్నించాడు. ఇక‌పై డ‌ల్‌గా ఉండొద్ద‌ని సూచించాడు. కాజ‌ల్‌ను తొండాట‌ వ‌ద్ద‌ని, ప‌ద్ధ‌తిగా ఆడ‌మ‌ని హిత‌వు ప‌లికాడు. త‌ర్వాత స‌న్నీ ఫొటోను చేతుల‌తో చింపేశిన నాగ్‌.. వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా జైలుకు పంపించినా మార్పు రాలేదా? అని నిల‌దీశాడు. ఒక వ్య‌క్తి ప‌ట్టుకున్న బ్యాగును త‌న్న‌డం స‌రైన‌దా? అని తిట్టిపోశాడు. బాగా ఆడుతున్నావ్ అంటూనే కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోమ‌ని సూచించాడు.

త‌ర్వాత హౌస్‌మేట్స్‌తో వైకుంఠ‌పాళి గేమ్ ఆడించాడు నాగ్‌. ఈ ఇంట్లో పైకి వెళ్ల‌కుండా కాటేసేది, ముందుకు వెళ్ల‌డానికి నిచ్చెన‌లా సాయం చేసేది ఎవ‌రో చెప్పాల‌ని ఆదేశించాడు. ముందుగా కాజ‌ల్‌.. త‌ను ముందుకు వెళ్ల‌డానికి సాయ‌ప‌డే నిచ్చెన మాన‌స్ అని, పాములా అడ్డుకునేది శ్రీరామ్ అని చెప్పుకొచ్చింది. ర‌వి.. త‌న‌ను పైకి ఎక్కించేది ష‌ణ్ను అని, కాజల్‌తో క‌నెక్ష‌న్ అవ‌డం లేదంటూ ఆమెను పాముగా పేర్కొన్నాడు. జెస్సీ.. విశ్వ నిచ్చెన అని, త‌న‌కు గొడ‌వ‌లు న‌చ్చ‌వంటూ స‌న్నీని పాముగా తెలిపాడు.

ప్రియాంక‌.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే మాన‌స్ త‌న‌ను ముందుకు తీసుకెళ్లే నిచ్చెన‌గా, లోబోను పాముగా పేర్కొంది. స‌న్నీ.. మాన‌స్ నిచ్చెన అని, సైలెంట్‌గా ఉంటూ కాటేసే ష‌ణ్ముఖ్ పాము అని అభిప్రాయ‌ప‌డ్డాడు. యానీ.. ర‌విని నిచ్చెన‌గా, కాజ‌ల్‌ను పాముగా; విశ్వ‌.. లోబోను నిచ్చెనగా, కాజ‌ల్‌ను పాముగా తెలిపారు. లోబో.. ర‌వి నిచ్చెన అని, స‌న్నీ పాము అని చెప్పుకొచ్చాడు. సొంత నీడ‌ను కూడా న‌మ్మొద్దని, ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరువు అని లోబో స‌న్నీకి క్లాస్ పీకాడు. శ్రీరామచంద్ర‌.. యానీ నిచ్చెన అని, పాములో ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ కాజ‌ల్‌కు ఉన్నాయ‌ని తెలిపాడు.

మాన‌స్‌.. స‌న్నీని నిచ్చెన‌గా, ర‌విని పాముగా అభిప్రాయ‌ప‌డ్డాడు. ర‌వి క‌రెక్ట్ టైంలో స‌పోర్ట్ చేయ‌లేద‌ని ఫీల‌య్యాడు. ఇక‌ ష‌ణ్ముఖ్‌.. సిరిని నిచ్చెన‌గా, ర‌విని పాముగా చెప్పుకొచ్చాడు. ర‌వి నా మైండ్ ఎక్క‌డ చ‌దివేస్తాడో అని భ‌య‌మేస్తుందంటూనే త‌న వ‌ల్లే గేమ్‌లో ముందుకెళ్తున్నాన‌న్నాడు. సిరి మోటివేట్ చేస్తుంద‌ని చెప్తూ వాళ్లిద్ద‌రూ హౌస్‌లో ఉండాల‌న్నాడు. త‌ర్వాత సిరి.. ష‌ణ్నును నిచ్చెన‌గా, స‌న్నీని పాముగా చెప్పుకొచ్చింది. మొత్తంగా కాజ‌ల్‌ను నాగిణిగా, స‌న్నీని పాముగా ప్ర‌క‌టించాడు నాగ్‌.

అనంత‌రం 'మెడ‌లో మోత‌- స‌రిపోయే సామెత' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్‌ సామెతలు చెప్తే దానికి సంబంధించిన‌ ప్లేట్‌ను ఎవ‌రికి సూటవుతుందో వారి మెడ‌లో వేయాల‌న్నాడు. స‌న్నీ.. కుక్క తోక వంక‌ర సామెత‌ను జెస్సీకి అంకిత‌మిచ్చాడు. మాన‌స్‌.. అబ‌ద్ధం ఆడినా అతికిన‌ట్లు ఉండాల‌ని ర‌వికి సూచించాడు. కాజ‌ల్‌.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి ప‌డుతుంది అన్న సామెత శ్రీరామ్‌కు సెట్ట‌వుతుంద‌ని చెప్పింది. యానీ.. రానురాను రాజు గుర్రం గాడిదైంది అన్న‌దాన్ని కాజ‌ల్‌కు ఇచ్చింది. ప్రియాంక‌.. కంద‌కు లేని దుర‌ద క‌త్తిపీట‌కు ఎందుకు అన్న సామెత‌ను సిరికి అంకిత‌మిచ్చింది. త‌ర్వాత శ్రీరామ్‌.. అంతంత కోడికి అద్ద‌సేరు మ‌సాలా సామెత కాజ‌ల్‌కు సూట‌వుతుంద‌న్నాడు. విశ్వ‌.. దున్న‌పోతు మీద వ‌ర్షం కురిసిన‌ట్లు సామెత లోబోకు సెట్ట‌వుతుంద‌న్నాడు. 

జెస్సీ.. పైన ప‌టారం, లోన లొటారం అన్న ప్లేటును స‌న్నీకిచ్చాడు. సిరి.. అంద‌ని ద్రాక్ష ప‌ళ్లు పుల్ల‌న అన్న‌ ప్లేటును ష‌ణ్ను మెడ‌లో వేసింది. ష‌ణ్ను.. ఏకులా వ‌చ్చి మేకులా త‌గులుకున్నాడ‌ని ర‌వి గురించి అభిప్రాయ‌ప‌డ్డాడు. ర‌వి.. ఓడ ఎక్కేవ‌ర‌కు ఓడ మ‌ల్ల‌న్న‌, ఓడ దిగిన త‌ర్వాత బోడ మ‌ల్ల‌న్న అనేది మాన‌స్‌కు స‌రిపోతుంద‌న్నాడు. లోబో.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుని ఏం లాభం అన్న సామెత‌ను యానీకి అంకిత‌మిచ్చాడు. ఈ రోజు నాగ్ ఎవ‌రినీ సేవ్ చేయ‌లేదు. ఇదిలా వుంటే రేప‌టి దీపావ‌ళి స్పెష‌ల్ ఎపిసోడ్‌లో శ్రియ‌, సుమ‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు స్పెష‌ల్ గెస్ట్స్‌గా రాబోతున్నారు. ఆ హంగామా చూడాలంటే రేపు సాయంత్రం ఆరు గంట‌ల‌కు రెడీగా ఉండాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement