పాతాళానికి పడిపోయిన శివాజీ గ్రాఫ్‌! మాట కోసం చస్తావా? పెద్ద జోక్‌.. | Bigg Boss 7 Telugu: Sivaji Exposed In Captaincy Task | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: దొరికిపోయిన సోఫాజీ.. ముసుగు ఊడిపోయింది.. విన్నర్‌ రేసులో నుంచి అవుట్‌

Published Sat, Nov 25 2023 4:31 PM | Last Updated on Sun, Nov 26 2023 12:13 PM

Bigg Boss 7 Telugu: Sivaji Exposed in Captaincy Task - Sakshi

'ఇచ్చిన మాట కోసం ప్రాణమిస్తాను బాబు గారూ.. నీతి, నిజాయితీ వైపే నిలబడతాను. ఎన్నడూ మాట తప్పను.. న్యాయం కోసం పోరాడుతాను..' అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే సోఫాజీ వీకెండ్‌లో నాగార్జున ముందు ఇచ్చే పర్ఫామెన్స్‌కు ఆస్కార్‌ ఇవ్వాల్సిందే! చేసేది గోరంత చెప్పేది కొండంత.. అవును మరి, తన డప్పు తను కొట్టుకోకపోతే నిజాలు, నిజస్వరూపాలు బయటపడిపోతాయి కదా.. ఆమాత్రం కవరింగ్‌ చేయాల్సిందే! కానీ ఎన్నాళ్లు? బిగ్‌బాస్‌ సీజన్‌ 7 కథ కంచికి చేరే సమయం దగ్గరపడుతోంది. ఇంకా ముసుగు వేసుకుంటే కష్టం కదా.. కానీ, నిన్నటి ఎపిసోడ్‌తో శివాజీ ముసుగు తొలగిపోయింది.. అతడి బండారం బయటపడింది.

ఇద్దరికీ మాటిచ్చాడట..
ఎవరి మీదా పగ లేదు అంటూనే కెప్టెన్సీ టాస్క్‌లో అమర్‌ మీద ఉన్న అక్కసునంతా వెల్లగక్కాడు శివాజీ. నిజానికి అమర్‌.. కెప్టెన్సీ పోటీలో సపోర్ట్‌గా ఉండమని అడిగితే శివాజీ నా ఓటు నీకే.. విజయం నీదేపో అన్నంత బిల్డప్‌ ఇచ్చాడు. తీరా టాస్క్‌లో అర్జున్‌ భార్య.. అతడు రెండోసారి కెప్టెన్‌ కావాలని కోరింది. ఆమెకు మాటిచ్చాను.. అంటూ అమర్‌కు వెన్నుపోటు పొడిచాడు. పోనీ నిజంగానే అర్జున్‌ను కెప్టెన్‌ చేయాలనుకుంటే గత వారాల్లో చేసి ఉండొచ్చుగా.. అంతదాకా ఎందుకు? అర్జున్‌ వర్సెస్‌ శివాజీ ఉన్నప్పుడు.. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని అర్జున్‌ను కెప్టెన్‌ చేసుంటే గొప్పోడివి అని అంతా చప్పట్లు కొట్టేవారు.

టార్గెట్‌ చేసింది ఎవరు?
ఏమీ ఆడకపోయినా సరే, చేతినొప్పి సింపథీతో హౌస్‌లో నెట్టుకొస్తున్న తనకు కెప్టెన్సీ కావాలి.. కానీ ఎన్నోసార్లు కెప్టెన్సీ కంటెండర్‌ దాకా వచ్చి కెప్టెన్‌కు అడుగుదూరంలో ఆగిపోయిన అమర్‌కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకూడదు. అలాంటప్పుడు అమర్‌కు అండగా నిలబడతానని మాటివ్వడం దేనికో? ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే... తను అతడిని టార్గెట్‌ చేసింది పోయి.. అమర్‌ తనను టార్గెట్‌ చేశాడని టాస్క్‌లో పచ్చి అబద్ధాలు చెప్పాడు. నువ్వు నాకు వ్యతిరేకంగా అన్ని చేసినా నేను ఏమీ అనలేదని మహానుభావుడిలా నటించాడు.

వెన్నుపోటు పొడిస్తే ఏడ్వక నవ్వుతారా?
అవునవును, ఛాన్స్‌ దొరికినప్పుడల్లా అమర్‌ మీద వెకిలి డైలాగులు, వెకిలి చేష్టలు చేసిందెవరో అందరికీ తెలుసు. తనను నీచాతినీచంగా చూసినా, టార్గెట్‌ చేసినా అమర్‌​ మాత్రం శివాజీకి గౌరవమిచ్చి మాట్లాడాడు. లోలోప ద్వేషంతో రగిలిపోతున్నా పైకి మాత్రం పెద్దమనిషిలా నటించాడు శివాజీ. పైగా నీకే నా సపోర్ట్ అని మాటిచ్చి గొంతు కోస్తే అమర్‌ అల్లాడిపోక ఇంకేం చేస్తాడు. చివరి కెప్టెన్సీ కళ్లముందే కోల్పోతుంటే, మాటిచ్చినవారే వెన్నుపోటు పొడుస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఈ ఏడుపులు.. డ్రామా.. సింపతీ ఆపంటూ కసురుకున్న శివాజీ.. ప్రశాంత్‌ ఏడిస్తే మాత్రం అతడి స్వభావమే అంత, కావాలని ఏడవట్లేదని వెనకేసుకొచ్చాడు. అది ఒక ఎమోషన్‌.. అని మాట్లాడాడు.

గౌతమ్‌ చేస్తే తప్పు.. నువ్వు చేస్తే ఒప్పా?
గత కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్‌.. ప్రియాంక తన చెల్లి అంటూ ఆమెకు సపోర్ట్‌ చేశాడు. ఆటలో అన్నాచెల్లెళ్లు అనేవి ఉండవంటూ గౌతమ్‌ను నామినేట్‌ చేశాడు శివాజీ. కానీ నిన్న మాత్రం అర్జున్‌ భార్య కోసం అతడికి సపోర్ట్‌ చేస్తున్నా అన్నాడు. అంటే తను మాత్రం బంధాలు, బాంధవ్యాలు ఆలోచించొచ్చు.. పక్కవారు మాత్రం నోరు మూసుకుని ఉండాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అమర్‌ కెప్టెన్‌ అయితే శోభా, ప్రియాంకలను డిప్యూటీలుగా పెట్టుకుంటానన్నాడు.. ఇది సోఫాజీకి నచ్చలేదట. కెప్టెన్‌ కానివారికి అవకాశం ఇవ్వొచ్చుగా అని వితండవాదన చేశాడు. మరి ఈ బాబుగారు కెప్టెన్‌ అయినప్పుడు ఆల్‌రెడీ కెప్టెన్‌ అయిన ప్రశాంత్‌, యావర్‌ను డిప్యూటీలుగా పెట్టుకున్నాడెందుకో? అంతే మరి మనం చేస్తే ఒప్పు.. పక్కోళ్లు చేస్తే తప్పు. ఏదేమైనా నిన్నటి ఒక్క ఎపిసోడ్‌తో శివాజీ గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయిందనే చెప్పాలి! ఈ దెబ్బతో అతడు టాప్‌ 2 రేసులో కూడా లేకుండా పోయాడు.

చదవండి: నెలసరి ఆలస్యం.. కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. ఫలితం ఏమని వచ్చిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement