బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరైనా దేనికి వెళ్తారు? గేమ్ ఆడటానికి.. కానీ ఈ సీజన్‌లో ఒకరు మాత్రం ఆటగాడిగా కన్నా కోచ్‌గానే ఎక్కువగా వ్యవహరిస్తున్నాడు. అతడెవరో మీకీపాటికే అర్థమై ఉంటుంది. కర్ర విరగకుండా పామును చంపడం శివాజీకి బాగా తెలుసు. ఈ చావు తెలివితేటలతోనే హౌస్‌లో నెట్టుకుంటూ వస్తున్నాడు. అందరిలోనూ తనే పెద్ద తోపు అని ఫీలవుతాడు. ఎదుటివారు ఒక్కటంటే ఒక్క మాట తనకు వ్యతిరేకంగా మాట్లాడినా తీసుకోలేడు. కానీ తను మాత్రం అందరినీ ఏది పడితే అది అనేస్తాడు.. దానికి ఎవరూ అడ్డు చెప్పొద్దు అన్నట్లుగా మాట్లాడతాడు.
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడంలో దిట్ట
హౌస్‌లో ఇప్పటివరకు శివాజీని గట్టిగా ప్రశ్నించింది ఎవరైనా ఉన్నారా? అంటే.. అది అమర్‌దీప్, గౌతమ్ మాత్రమే! కానీ వాళ్లు అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేని శివాజీ అడ్డదారిలో నరుక్కొచ్చేవాడు. అసలు నువ్వేం ఆడావు? నీ ఆట నాకు కనిపించలేదు అని బట్ట కాల్చి మీద వేసేవాడు. మొదటి నుంచీ ఇప్పటివరకు నువ్వు ఆడిందే లేదు అని వారిలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేవాడు. అలా అమర్‌ను కిందకు లాగడంలో సక్సెస్ అయ్యాడు కూడా!
తను ఆడితే గేము.. అవతలివారు ఆడితే క్రైమూ..
ఈ వారం జరిగిన ఏలియన్స్ టాస్కులో కూడా శివాజీ ఆడలేదు. సంచాలకుడిగా మాత్రమే వ్యవహరించాడు. ఏలియన్స్ ఇచ్చిన టాస్కుల్లో జిలేబీపురం గెలవడంతో అందులో ఉన్న అందరూ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో టీమ్‌ను గెలిపించినవారికి ఒక ఛాన్స్ ఇద్దామనుకున్నాడు అమర్. అందుకని గేమ్ ఆడకుండా కూర్చున్న శివాజీని కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించాడు. అది జీర్ణించుకోలేకపోయిన శివాజీ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు.
సింపతీ డ్రామాలు
నేనొక వేస్ట్ క్యాండెట్‌లా కనిపిస్తున్నాను అంటూ సీన్ క్రియేట్ చేశాడు. కన్ఫెషన్ రూమ్‌లోనూ బిగ్‌బాస్ ముందు ఏడ్చేశాడు. నేను ఆడటం లేదని పరోక్షంగా అనేసరికి తట్టుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఇదే మాటను డైరెక్ట్‌గా గౌతమ్, అమర్‌దీప్‌లతో చాలాసార్లు అన్నాడు శివాజీ. నువ్వు ఏ గేమూ ఆడలేదు. నీకు ఆడటమే చేతకాదు.. అని నానామాటలు అని వారిని మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. అంటే తను చేస్తే ఒప్పు, ఎదుటివాళ్లు చేస్తే తప్పా?
ఆ ఇద్దరినీ పావులుగా వాడుకుంటున్న శివాజీ
అందరినీ గ్రూప్ గేమ్ అంటూ బ్లేమ్ చేసే శివాజీయే అసలైన గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన ఆట కోసం పావులుగా మార్చుకున్నాడు. నామినేషన్స్ దగ్గరి నుంచి గేమ్ వరకు ఎక్కడ ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. తను ఆడటం మానేసి వాళ్లతో ఆడించాలనుకుంటున్నాడు. అంతేకాదు, వారికి లేనిపోనివి నూరిపోస్తున్నాడు కూడా! పైకి మాత్రం తనకు అందరూ సమానమే అని నీతులు వల్లిస్తున్నాడు.
అమర్‌దీప్‌ను మొదటి నుంచీ టార్గెట్
ఇకపోతే అమర్‌దీప్ గురించి బిగ్‌బాస్ షోకు రావడానికి ముందే బాగా తెలుసుకున్నాడు శివాజీ. అమర్-తేజస్వినిల ఇంటర్వ్యూ కూడా చూశానని అమర్‌తోనే చెప్పాడు. అంటే అతడిని సైడ్ చేయాలని ముందుగానే గట్టిగా ప్లాన్ వేసుకుని మరీ వచ్చాడు. మొదటి నుంచి అమర్‌ను టార్గెట్ చేస్తూ పోయాడు. గేమ్‌లో అమర్‌ను కిందకు లాగడమే కాకుండా తనను చులకన చేస్తూ మాట్లాడుతున్నాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా చెప్తారా.. నిన్ను మాత్రం నమ్మవద్దని నా పిల్లలకు చెప్తా..' అని శివాజీ తనతో అన్నాడని అమర్‌దీప్ బాధపడ్డాడు. అంటే అమర్ మీద శివాజీకి ఎంత కోపం ఉందో ఇక్కడే తెలిసిపోతుంది.
రైతుబిడ్డకు సపోర్ట్ చేసేది అందుకే!
వ్యక్తిగతంగా అతడి మీద అంత పగ దేనికి? ఎందుకని శివాజీ అమర్‌ను టార్గెట్ చేస్తున్నాడు? అని నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమర్‌దీప్‌ను సైడ్ చేయాలన్నది శివాజీకి ముందు నుంచీ ఉన్న ప్లాన్. అందులో భాగంగానే షో ప్రారంభం నుంచి అతడిని టార్గెట్ చేస్తూ తనను కిందకు లాగాడు. ఆ తర్వాత సామాన్యులకే తన మద్దతు అంటూ ప్రశాంత్, ప్రిన్స్‌లకు సపోర్ట్ చేస్తూ బయట తనకు పాపులారిటీ పెంచుకోవాలనుకున్నాడు. రైతుబిడ్డకు సపోర్ట్ చేస్తే బయట తనకు సింపతీ పెరుగుతుందని, అది తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నది తన ఆలోచన.
పాతాళానికి తొక్కేస్తాడు
అందుకే ఎప్పుడూ అతడిని ఆకాశానికెత్తేస్తూ ఉంటాడు, అవతలివారిని పాతాళానికి తొక్కేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు ఏ గేమూ ఆడకపోయినా అవతలివారిని మాత్రం హేళన చేయడం ఆపడం లేదు. మళ్లీ అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి బాగోగులు కోరుకున్నట్లు నటిస్తుంటాడు. కానీ ఇంకా ఎన్నాళ్లు శివాజీ? ఎప్పటికైనా ముసుగు తీయాల్సిందే.. నిజ స్వరూపం బయటపడాల్సిందే!
Looks going personal now#BiggBossTelugu7 #Amardeep #Shivaji pic.twitter.com/jUU0BYWAzk
— BiggBossTelugu7 (@TeluguBigg) October 19, 2023
చదవండి: మొన్నటివరకు శివాజీ.. ఇప్పుడు శోభ, ప్రియాంక.. అందరూ అమర్‌ను చులకనచేసి మాట్లాడేవారే
Comments
Please login to add a commentAdd a comment