టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే భోజన ప్రియుడు.. కాదు కాదు, భోజన ప్రియుడు కాబట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ తన పేరుకు న్యాయం చేస్తూ గుడ్లు దొంగతనం చేస్తూ, స్ప్రైట్‌ల కోసం కక్కుర్తి పడేవాడు. ఈ పోరాటం ఏదో ఆటలో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్లు ఉండేవాడు. కానీ, అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజను చూసి జనాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అతడిని బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు పంపించారు.
గొప్పగా ఆడకపోవచ్చు. కానీ..
నిజానికి తేజ మరీ తొమ్మిది వారాలదాకా ఉంటానని అనుకోలేదట. ఏదో నాలుగువారాలు ఉండిపోదాంలే అనుకున్నాడట. కానీ తొమ్మిదివారాల దాకా ప్రేక్షకులు తనను హౌస్‌లో ఉంచడంతో తనను తనే నమ్మలేకపోతున్నాడు. నిజంగానే తేజ గొప్పగా ఆడకపోవచ్చు. కానీ కడుపుబ్బా నవ్వించాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉన్నాడు. చిన్నపాటి గొడవలు జరిగినా సర్దుకుపోయే మనస్తత్వం తనది. అదే సమయంలో పుల్లలు పెట్టి అందరి మధ్య చిచ్చు పెట్టే నారదుడు కూడా!
భలే సేఫ్‌గా ఆడేవాడు..
ఒకరి మాటను మరొకరికి చెప్పి వాళ్ల మధ్య అగ్గి రాజేసేవాడు. కొన్నిసార్లు అవతలి వారు ఏమీ అనకపోయినా నిన్నిలా అన్నారు, ఆ మాటన్నారు.. అని లేనిపోనివి చెప్పి కారాలు, మిరియాలు నూరేవాడు. కొన్నిసార్లు అడ్డంగా బుక్కయ్యాడు కూడా! నామినేషన్స్‌లోనూ భలే సేఫ్‌గా ఆడేవాడు. ఎదుటివారిని నొప్పించకుండా తను డేంజర్ జోన్‌లోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను నామినేషన్స్‌లోకి పంపించేవాడు.
రెమ్యునరేషన్ ఎంతంటే?
అలా అతడు నామినేట్ చేసినవాళ్లు కొందరు ఎలిమినేట్ అయ్యారు కూడా!. కానీ ఈ వారం తేజ ఎలిమినేషన్ కత్తికి బలైపోయాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న అతడు బాగానే వెనకేశాడు. వారానికి దాదాపు రూ.1.75 లక్షల మేర తీసుకున్నాడట. ఈ లెక్కన తొమ్మిది వారాలకుగానూ రూ.15 లక్షల పైనే వెనకేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment