'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్‌మేట్స్ వీళ్లే | Bigg Boss 8 Telugu Grand Launch Episode Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 1 Highlights: బిగ్‌బాస్ 8లో ఈసారి నో కెప్టెన్, నో రేషన్.. ఇంకా!

Published Sun, Sep 1 2024 7:00 PM | Last Updated on Sun, Sep 1 2024 10:29 PM

Bigg Boss 8 Telugu Grand Launch Episode Live Updates And Highlights

బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశారు. గత సీజన్‌లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. గత సీజన్ వల్ల ఈసారి షోపై క్యూరియాసిటీ మాత్రం గట్టిగానే ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఈ సీజన్ డిఫరెంట్‌గా ఉండబోతుందని నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇందులో భాగంగానే 14 మంది హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇంతకీ ఆదివారం లాంచ్ ఎపిసోడ్ లో ఏమేం జరిగింది? అనేది చూద్దాం.

అందరికీ వెల్కమ్ చెప్పిన నాగార్జున.. హౌసులోకి వెళ్లిపోయారు. ఈసారి బిగ్ బాస్ హౌసులో ఏమేం ఉన్నాయో చూపించేశారు. ఈసారి స్పెషల్ రూమ్ అలియాస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని.. అలానే గోల్డెన్ రూమ్ (స్ట్రేటజీస్ ప్లే చేసే రూమ్), తూనీగ రూమ్ (కష్టంతో పాటు అదృష్టం ఉంటే గానీ ఇందులోకి రాలేరు), నెమలి (ఆడే బలం, ఆలోచించే పవర్ ఉండాలి), జీబ్రా రూమ్ (ఎవరికీ లొంగకుండా, మాట పొగరుకు భయపడకుండా ఉండేవాళ్లే ఈ గదిలోకి వస్తారు) ఉందని చెప్పారు.

తొలి కంటెస్టెంట్‌గా నటి యష్మి గౌడ
ఈ కన్నడ బ్యూటీ పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. నటన అంటే ఇష్టం. ఇంట్లోవాళ్లకేమీ నచ్చేది కాదు. అయినా ఓ కన్నడ ఛానల్‌లో ఏదో సీరియల్‌కు ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి ఆశగా వెళ్లింది. ఫస్ట్‌ ఆడిషన్‌లోనే ఎంపికైంది. అలా కెరీర్‌ మొదలైంది.

స్వాతి చినుకులు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు అయింది. లాక్‌డౌన్‌ సమయంలో నాగభైరవిలో నటించే అవకాశం వచ్చింది. కృష్ణ ముకుంద మురారి ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత నచ్చేసింది. కన్నడలో ఓ మూవీలోనూ యాక్ట్‌ చేసిన ఈ బ్యూటీకి సిరామిక్‌ పాత్రలు, మగ్గులు, కప్పులు తయారుచేసే బిజినెస్‌ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో నటించాలని కలలుగంటున్న యష్మికి బిగ్‌బాస్‌ ఏమేరకు కలిసొస్తుందో చూడాలి!

తనకు గతంలో బ్రేకప్ అయిందని, పెళ్లిపై తనకు పెద్దగా అభిప్రాయం లేదని, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదని యష్మి గౌడ చెప్పింది. తనకు అస్సలు వంట రాదని, ఎవరితోనైనా చెప్పి చేయించుకుంటానని చెప్పింది. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేనని చెప్పింది. చెప్పిన పనిచేయకపోయినా, అబద్ధం చెప్పిన తనకు కోపం వస్తుందని యష్మి గౌడ చెప్పింది.

ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్‌ని ఒంటరిగా కాకుండా జోడీలుగా హౌసులోకి పంపిస్తామని చెప్పి నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. ఇక అలా యష్మి గౌడ ఒకరిని ఎంచుకోగా.. ఆ ప్లేసులో సీరియల్ నటుడు నిఖిల్ వచ్చాడు.

రెండో కంటెస్టెంట్‌గా నిఖిల్ మళయక్కళ్
గోరింటాకు సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్నాడు నిఖిల్‌. ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్‌లో.. చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టం ఉండటంతో 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశాడు. ఇందులో సహాయక పాత్ర పోషించాడు.

అనంతరం కన్నడలో మలయే మంత్రాలయ సీరియల్‌లో తొలిసారి నటించాడు. తెలుగులో ఛాన్స్‌ రావడంతో ఇక్కడికి షిఫ్ట్‌ అయ్యాడు. ఈ మధ్యే ఊర్వశివో రాక్షసివో సీరియల్‌లో అలరించాడు. ఇప్పుడిలా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. యాక్టివ్‌గా ఉంటూ పంచులు వేసే ఈ నటుడు ఇప్పుడు హౌస్‌లో ఎలా ఉంటాడో చూడాలి!

మూడో కంటెస్టెంట్‌గా అభయ్ నవీన్
అభయ్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. కాలేజీ అయిపోగానే బ్యాంక్‌ ఉద్యోగం రావడంతో లైఫ్‌ సెటిలైపోయిందనుకున్నారు. అయితే అభయ్‌ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలీగ్స్‌.. సినిమాల్లో ట్రై చేయ్‌ అని సలహా ఇచ్చారు. మరోవైపు ప్రమోషన్‌ రాకపోవడంతో అభయ్‌ హర్ట్‌ అయ్యాడు. తెల్లవారే రాజీనామా చేశాడు.

సినిమాల్లో ట్రై చేశాడు. బొమ్మల రామారంలో నటించాడు. పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో యాక్ట్‌ చేశాడు. అలా కొన్ని మూవీస్‌ చేసిన అతడు ఓ కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారే కానీ ప్రొడ్యూస్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా రిలీజ్‌ చేసే సమయానికి అభయ్‌ తండ్రి మరణించాడు. మూడేండ్ల నిరీక్షణ తర్వాత రామన్న యూత్‌ రిలీజ్‌ చేశాడు. డైరెక్టర్‌గా ఫస్ట్‌ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు.

నాలుగో కంటెస్టెంట్‌గా ప్రేరణ
'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్‌తో ప్రేరణ కంభం ఎక్కువ పాపులర్‌ అయింది. అమాయకంగా కనిపించే ప్రేరణ క్యూట్‌ యాక్టింగ్‌ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. ఈ ధారావాహికలో కృష్ణగా ప్రేరణ, ముకుందగా యష్మి గౌడ నటించారు. సీరియల్‌లో మురారి కోసం కొట్టుకున్నట్లే బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో వీరిద్దరు టైటిల్‌ కోసం పోటీపడటం ఖాయమని తెలుస్తోంది. సీరియల్‌లో తనే గెలిచినట్లు ఇక్కడ కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి!

తాను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడాడని.. దాదాపు అన్ని గేమ్స్‌లోనూ పార్టిసిపేట్ చేశానని ప్రేరణ చెప్పింది. అలానే హీరోయిన్ రష్మిక తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. అప్పట్లో రాత్రి 2 గంటలకు స్కూటీపై సూట్ కేస్ పట్టుకుని మోడలింగ్ కోసం తిరిగే వాళ్లమని చెప్పి షాకిచ్చింది. పెళ్లయి ఎన్నాళ్లు అయిందని అడగ్గా.. 8 నెలలే అయిందని, కాకపోతే ఇది చాలా మంచి అవకాశమని చెప్పింది. అలానే తన భర్త శ్రీపాద్ చెప్పిన కొన్ని ఫన్నీ సమాధానాల గురించి హోస్ట్ నాగార్జునతో నవ్వుతూ మాట్లాడింది.

ఐదో కంటెస్టెంట్‌గా ఆదిత్య ఓం
లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యాడు ఆదిత్య ఓం. తొలి సినిమాతోనే క్రేజ్‌ అందుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్ట్‌ చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన టాలెంట్‌ చూపించాడు. ఒకప్పుడు టాప్‌ హీరోగా వెలుగొందిన అతడు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. కానీ, అవేవీ పెద్దగా ఆదరణకు నోచుకోవడం లేదు.

ఆదిత్య.. దర్శకనిర్మాతగానూ తన ప్రతిభ చూపించాడు. సినిమాలు లేని టైంలో డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు. రోజుకు 60 సిగరెట్లు తాగాడు. కానీ కుటుంబం వల్ల ఆ మానసిక ఒత్తిడి నుంచి నెమ్మదిగా కోలుకున్నాడు.

ఇతడు రీల్‌ హీరో మాత్రమే కాదు రియల్‌ హీరో కూడా! ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశాడు. అలాగే అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్‌బాస్‌ షోతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూస్తున్నాడు. మరి ఈ షో ద్వారా జనాలను ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి!

ఆరో కంటెస్టెంట్‪‌గా సోనియా
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి, లేదా తన సినిమాల్లో నటించిన బ్యూటీలకు క్రేజ్‌ వేరే లెవల్ ఉంటుంది. అలా వర్మ స్కూల్‌ నుంచి అరియానా గ్లోరీ, అషూ రెడ్డి, ఇనయ సుల్తానా గత బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్నారు. ఈసారి వర్మ మెచ్చిన హీరోయిన్‌ సోనియా ఆకుల బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఈమె జార్జ్‌ రెడ్డి సినిమాలో హీరో చెల్లిగా నటించింది. వర్మ 'కరోనా వైరస్‌'లోనూ మెప్పించింది. దిశ ఎన్‌కౌంటర్‌ ఆధారంగా తెరకెక్కిన ఆశా ఎన్‌కౌంటర్‌లోనూ యాక్ట్‌ చేసింది. ఇక్కడ విశేషమేంటంటే.. దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు రూ.15వేలు సాయం చేసింది.

ఈమె సొంత ఊరు పెద్దపల్లి జిల్లాలోని మంథని. కలెక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయింది. సమాజానికి తనవంతు సేవ చేయాలన్న కోరికతో ఆసా అనే సంస్థ ఏర్పాటు చేసింది. సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ 8లో రాణిస్తుందేమో చూడాలి!

ఇక సోనియా కోసం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పెషల్ వీడియో పంపించారు. ఇందులో ఆమె గెలవాలని కోరుతూ తన అభిప్రాయాన్ని చెప్పారు.

ఏడో కంటెస్టెంట్‌గా మధు నెక్కంటి (బెజవాడ బేబక్క)
బెజవాడ బేబక్క పేరు మధు నెక్కంటి. పెళ్లి చేసుకుంది, కానీ ఆ వైవాహిక బంధం ఎంతోకాలం నిలవలేదు. తనకంటూ ఓ క్రేజ్‌ ఉండాలన్న కసితో సోషల్‌ మీడియాలో ఫన్నీగా వీడియోలు ట్రై చేసింది. అవి జనాలకు ఎంతో నచ్చేయడంతో బెజవాడ బేబక్కగా ఫేమస్‌ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వచ్చేసింది.

ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ భాషా
హీరో రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో శేఖర్‌ భాషా పేరు బాగా వైరలయింది. ఈయన అసలు పేరు గుదిమెళ్ల రాజశేఖర్‌. చదివింది ఇంజనీరింగ్‌.. 2005లో జెమిని మ్యూజిక్‌లో వీడియో జాకీగా కెరీర్‌ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే హాయ్‌ బుజ్జి వంటి పిల్లల ప్రోగ్రామ్స్‌తో పాటు మూడువేలకు పైగా షోలలో పాల్గొన్నాడు. తర్వాత రేడియో జాకీగా మారి మరింత పేరు సంపాదించుకున్నాడు.

కాకినాడలో పుట్టాడు. ఇంజనీరింగ్‌ పూర్తవగానే 2005లో రేడియో జాకీగా కెరీర్‌ మొదలుపెట్టాడు. 18 ఏళ్ల ప్రస్థానంలో 18 ఐఆర్‌ఎఫ్‌ అవార్డులు పొందాడు. ఇన్ని అవార్డులు పొందిన ఏకైక ఆర్జే ఇతడే కావడం విశేషం.

వెల్‌కమ్‌ ఒబామా సినిమాతో నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వెతికా నేను నా ఇష్టంగా అనే చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. పంచముఖి మూవీలో డైరెక్టర్‌ పాత్ర పోషించాడు. నటుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా పేరు గడించిన ఈయన రాజ్‌ తరుణ్‌ను పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన క్రమంలో అతడికి స్నేహితుడయ్యాడు. ఈ పరిచయంతోనే లావణ్య.. రాజ్‌తరుణ్‌పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ హీరోకు మద్దతుగా నిలబడ్డాడు. ఇప్పుడిలా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు.

తొమ్మిదో కంటెస్టెంట్‌గా కిర్రాక్‌ సీత
బోల్డ్‌ కంటెంట్‌తో పాపులర్‌ అయింది కిర్రాక్‌ సీత. పలు షార్ట్‌ ఫిలింస్‌ చేసిన ఈ బ్యూటీ బేబి మూవీలోనూ యాక్ట్‌ చేసింది. హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నెగెటివ్‌ క్యారెక్టర్‌ పోషించింది. ఎక్కువగా ఆ తరహా పాత్రల్లోనే కనిపించింది. గతంలో యూట్యూబర్‌ సరయుతో కలిసి పని చేసింది. తర్వాత ఏమైందో ఏమో కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది.

బోల్డ్‌గా మాట్లాడే ఈ బ్యూటీకి మందు తాగే అలవాటు కూడా ఉంది. గతంలో ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమ పెళ్లివరకు రాకముందే బ్రేకప్‌ అయింది. ఏదైనా ముఖం మీదే మాట్లాడే ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలా ఉంటుందో చూడాలి!

పదో కంటెస్టెంట్‌గా నాగమణికంఠ
నాగమణికంఠ సీరియల్‌ యాక్టర్‌. ఇతడు పుట్టిన రెండేళ్లకే నాన్న చనిపోయాడు. దీంతో అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. ఊహ తెలిసేసరికి తన ముందున్న తండ్రి కన్నవాడు కాదని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న కొట్లాటలు చాలదన్నట్లు తన తల్లికి క్యాన్సర్‌ అని తేలింది. కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నించాడు కానీ అమ్మను బతికించుకోలేకపోయాడు. 2019లో తల్లిని కోల్పోయాడు. ఆమెకు తలకొరివి పెట్టిన పదకొండే రోజే ఇంటి నుంచి బయటకు వచ్చాడు.

దేవుడు ఒకటి లాక్కుంటే మరొకటి ఇస్తాడన్నట్లు మంచి ఉద్యోగం దొరికింది. కానీ ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. తన తల్లే తనకు కూతురిగా పుట్టిందని సంతోషించాడు. అంతలోనే గొడవల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇన్ని కష్టాలు చూసిన ఇతడు తర్వాత నటుడిగా బుల్లితెరపై స్థానం సంపాదించాడు.

కంటెస్టెంట్ల ఎంట్రీకి చిన్న బ్రేక్‌ ఇస్తూ సరిపోదా శనివారం మూవీ టీమ్‌ను స్టేజీపైకి పిలిచాడు నాగ్‌. అంతేకాదు, సినిమాకు పాజిటివ్‌ రివ్యూ ఇచ్చినవారి వీడియోలను చిన్న ప్రోమోగా చూపించి నానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

పదకొండో కంటెస్టెంట్‌గా పృథ్వీరాజ్
ఇతడు సీరియల్‌ నటుడు. నాగపంచమి సీరియల్‌తో బుల్లితెర హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ రియాలిటీ షో గురించి మాట్లాడుతూ.. ఎక్స్‌పీరియన్స్‌ కోసం బిగ్‌బాస్‌ వస్తున్నానంటున్నాడు. అలాగే డబ్బు, పేరు కూడా ముఖ్యమేనని చెప్తున్నాడు. ‍ప్రస్తుతం తాను సింగిల్‌ అని చెప్పాడు. మరి బిగ్‌బాస్‌ షోలో ఈ హీరో ఎలా అదరగొడతాడో చూడాలి!

పన్నెండో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ
తెలుగు బుల్లితెర యాంకర్‌గా విష్ణుప్రియ పేరు అందరికీ సుపరిచితమే! పోవే పోరా కార్యక్రమంతో యాంకర్‌గా అలరించిన ఈ బ్యూటీ కామెడీ స్కిట్స్‌లోనూ పాల్గొంటూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ మానస్‌తో కలిసి చేసిన జరీజరీ చీర కట్టి సాంగ్‌ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జేడీ చక్రవర్తి తన ఫస్ట్‌ క్రష్‌ అని, తనతో పెళ్లికి రెడీ అంటూ అప్పట్లో నానా హంగామా చేసింది. కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ ముఖమే చూడనన్న ఈ బ్యూటీ ఏకంగా హౌస్‌లోనే ఎంట్రీ ఇచ్చింది. అందచందాలతో అల్లాడించే ఈ యాంకర్‌ ఆట ఎలా ఉంటుందో మున్ముందు తేలనుంది.

పదమూడో కంటెస్టెంట్‌గా నైనిక
డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ (ఆరో సీజన్‌), ఢీ (13, 14వ సీజన్లు) రియాలిటీ షోలతో ఫేమస్‌ అయింది నైనిక. కవర్‌ సాంగ్స్‌, మ్యూజిక్‌ వీడియోలతోనూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. అలాగే ఢీలో తన కో కంటెస్టెంట్‌ సాయితో రొమాంటిక్‌ స్టెప్పులు వేసి మరింత పాపులర్‌ అయింది. అలాగే అతడితో లవ్‌- బ్రేకప్‌తోనూ వార్తల్లో నిలిచింది.  ఈ తెలుగమ్మాయి డ్యాన్సరే కాదు మంచి నటి కూడా! గ్లామర్‌లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లకు గట్టి పోటీనిస్తుందేమో చూడాలి! వెళ్లిన మూడు రోజుల్లోనే ముగ్గురితో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకోవాలని నైనికకు నాగార్జున ఛాలెంజ్ ఇచ్చారు.

పద్నాలుగో కంటెస్టెంట్‌గా నబీల్ అఫ్రిది
సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. పుట్టి పెరిగిందంతా వరంగల్‌లోనే! చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే పిచ్చి. ఆడిషన్స్‌కు తీసుకెళ్లు అని తండ్రిని విసిగించాడు. ఇతడి పోరు పడలేక సరే, నీకు నచ్చింది చేసుకో అన్నాడు.

తండ్రి అనుమతి దొరకడంతో ర్యాప్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిల్మ్స్ చేశాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఏం చేయాలో తోచలేదు. మనపై మనమే కుళ్లు జోకులు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. వరంగల్‌ డైరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌తో స్టార్‌ అయిపోయాడు. లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఛాన్స్‌ రావడంతో సంతోషంగా ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్‌ 8లో పద్నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.

ఈసారి బ్యాడ్ న్యూస్‌లు
హోస్ట్ నాగార్జున తొలి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్‌లో అస్సలు కెప్టెన్ అనే వాడు ఉండడని చెప్పి షాకిచ్చారు. అలానే 'నో రేషన్' అని చెప్పి షాకిచ్చాడు. ఒకవేళ లిమిట్‌లెస్ రేషన్ గెలుచుకోవాలంటే పోటీల్లో గెలిచి వాటిని సంపాదించుకోవాల్సి ఉంటుందని నాగార్జున చెప్పారు. ఇక చివర్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చివరి రెండు జంటలతో గేమ్ ఆడించి వెళ్లిపోయాడు. యాక్షన్ రూమ్ అయిన పీకాక్ గదిలోకి బిగ్‌బాస్.. అందరినీ రమ్మన్నాడు. ప్రైజ్‌మనీ అనేది ప్రస్తుతం జీరో అని.. ఎంత ఆడితే అంత సంపాదించుకోవచ్చని చెప్పి చేదువార్త చెప్పాడు. అలా లాంచ్ ఎపిసోడ్ విజయవంతంగా ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement