దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతా డిజిటల్ మయం ఐపోయేసరికి దానికి తగ్గట్లే కేటుగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఫేం కీర్తిభట్ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్ కోసం ఓ లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ చానల్‌లో తెలియజేస్తూ ఓ వీడియోని వదిలారు. అసలేం జరిగింది? ఆమె మాటల్లోనే..
‘నాకొక ముఖ్యమైన కొరియర్ రావాల్సి ఉంది. వారం రోజులు అయినా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశా. వాళ్లు డెలివరీ చేశాం.. మెహదీపట్నంలో ఉందని చెప్పారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే మెహదీపట్నంలో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత నాకొక కాల్ వచ్చింది. వాళ్లు హిందీలో మాట్లాడుతూ.. ‘మికొక కొరియర్ రావాలికదా? అన్నారు. అవును ఇంకా రాలేదు అని చెప్పాను. మీ లొకేషన్ అడ్రస్ అప్‌డేట్ కాలేదు మేడం. ఒక్కసారి వాట్సాఫ్ ద్వారా మీ అడ్రస్‌ని పంపించండి అని ఒక నెంబర్ ఇచ్చారు. నేను కాల్ మాట్లాడుతూ.. ఆ నెంబర్‌కి అడ్రస్ పంపించాను. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి అప్‌డేట్ కావడం లేదు.. నార్మల్ మెసేజ్ చేస్తా..దానికి రిప్లై ఇవ్వండి అని చెప్పారు. నేను ఆ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నా మొబైల్ నెంబర్‌కి ఒక లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయమని చెప్పారు. ఆ లింక్‌ని కాపీ చేసి వాళ్లు పంపిన వేరే నెంబర్‌కి ఫార్వర్డ్ చేయమన్నారు. అలాగే చేశాను.
ఆ తరువాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి.. దాన్నిఓపెన్ చేయమన్నారు. అడ్రస్ అప్డేట్‌కి రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని అన్నారు. రెండు రూపాయలే కదా అనుకొని నేను సరే అన్నాను. యూపీఐ మెన్షన్ చేయమని అన్నారు. నాకు డౌట్ వచ్చి.. చేయనని చెప్పాను. అప్పుడు బ్యాంక్‌కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఇదేనా అని అడిగారు. ఇదే అని చెప్పాను. నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ వచ్చింది. మేడమ్ మీకు కాసేపు ఆగి కాల్ చేస్తాం.. అప్‌డేట్ ఇస్తాం అని అన్నారు. వాళ్లు ఫోన్ కట్ చేసిన కాసేపటికి రెండు రూపాయిలు నా అకౌంట్ నుంచి కట్ అయ్యింది. సరే రెండు రూపాయిలే కదా అని నేను పట్టించుకోలేదు. ఆ తరువాత నేను షూటింగ్‌కి వెళ్లిపోయాను.
సరిగ్గా మిడ్‌నైట్ 12 గంటలకు రూ. 99 వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే మరో రూ.99 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాలెన్స్ చెక్ చేస్తే..నిజంగానే రూ. 2లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు చూపించింది. . వెంటనే నాకు ఏం చేయాలో తెలియక.. కార్తీక్‌కి ఫోన్ చేస్తే.. సైబర్‌లో కంప్లైంట్ ఇచ్చాం. నా అకౌంట్‌ని బ్లాక్ చేయించాను. సైబర్ క్రైమ్ వాళ్లు యాక్షన్ తీసుకున్నారు. ట్రాకింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని అంటున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి.. ట్రాన్స్‌ఫర్ కాకుండా వాళ్ల అకౌంట్‌లను బ్లాక్ చేయించగలిగాం. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో సైబర్ క్రైమ్ వాళ్లకి సెల్యూట్ చేస్తున్నా. ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలు మీకు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి’ అని కీర్తీభట్ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment