బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం అంటూ ఊరించిన బిగ్‌బాస్ షో లైవ్ స్ట్రీమింగ్‌ను ఆపేస్తూ అభిమానులకు సడన్ షాకిచ్చింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో లైవ్ స్ట్రీమింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది హాట్‌స్టార్.
ఇకపోతే షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిపెడుతున్నారు. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఏడుపులు, అల్లర్లు, గొడవలు.. ఇలా అన్నింటినీ చూపిస్తున్నారు. 17 మందితో మొదలైన ఈ షోలో మాజీలతో పోటీపడి మరీ ఆడుతున్నారు కొత్త కంటెస్టెంట్లు. నామినేషన్స్‌లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా వారియర్ల (సీనియర్ల) తప్పొప్పులను ఎత్తిచూపిస్తూ నామినేట్ చేశారు. ఈ వారం వారియర్స్ టీమ్‌లో నుంచి సరయు, నటరాజ్ మాస్టర్, అరియానా గ్లోరీ, హమీదా, ముమైత్ ఖాన్ చాలెంజర్స్ టీమ్‌లో నుంచి మిత్ర శర్మ, ఆర్జే చైతూ నామినేట్ అయ్యారు.
ఈ ఏడుగురిలో అరియానా, హమీదాకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో వీరు ఎలిమినేషన్ దరిదాపుల్లో కూడా ఉండరు. ఆర్జే చైతూకు యాంకర్ శ్రీముఖి, ఆర్జే కాజల్ సహా పలువురి సపోర్ట్ ఉండనే ఉంది. కాబట్టి అతడు కూడా గండం గట్టెక్కినట్లే! ముమైత్ ఖాన్‌కు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. మిగిలిందల్లా నటరాజ్ మాస్టర్, సరయు, మిత్ర శర్మ. ఈ ముగ్గురిలో నటరాజ్ మాస్టర్, సరయుకు బిగ్‌బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్ల నుంచి సపోర్ట్ లభిస్తోంది. అలాగే మాస్టర్ ఉంటే షోలో కొంత గొడవల మసాలా కూడా ఉంటుందని భావించేవాళ్లు చాలామందే. ఈ లెక్కన నటరాజ్ మాస్టర్ కూడా సేవ్ అయిపోతాడని తెలుస్తోంది.
గత సీజన్‌లో మొదటివారంలోనే ఎలిమినేట్ అయింది సరయు. ఈసారి ఆమె ఆటతీరు చూడాలని ప్రేక్షకులు ఛాన్స్ ఇస్తే ఆమె కూడా హౌస్‌లో ఉండగలుగుతుంది. మిత్రశర్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. అందులోనూ నామినేషన్స్‌లో ఎక్కువతగా తడబడింది. తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేకపోయింది. ఈ తడబాటు వల్లే వారియర్స్ ఆమెను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయట. పరిస్థితి ఇలాగే కొనసాగితే తొలి వారంలోనే మిత్ర శర్మ తిరుగుముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment