బుల్లితెరపై బిగ్‌బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా ఈ రియాల్టీ షోకి మంచి ఆదరణ ఉంది. అందుకే ఓటీటీలో కూడా ఈ షోని రన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు సీజన్లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయి మంచి విజయం సాధించాయి. దీంతో తాజాగా హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3ని ప్రారంభించారు మేకర్స్. ఎప్పటి మాదిరిలో ట్రెండింగ్‌లో ఉన్న నటీనటులతో పాటు ఫేమస్ యూట్యూబర్స్ ఇందులో పాల్గొన్నారు.
అయితే ప్రతి సీజన్‌లోనూ ఓ జంట ఇందులో పాల్గొంటుంది. సీజన్‌లో 3లో కూడా దాన్ని కొనసాగించారు. విచిత్రంగా ఓ కంటెస్టెంట్ తన ఇద్దరు భార్యలతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. ఆ కంటెస్టెంట్ పేరు ఆర్మాన్ మాలిక్. అతనో ఫేమస్ యూట్యూబర్. మొదటి భార్య పాయల్ మాలిక్, రెండో భార్య క్రితికా మాలిక్ ఇద్దరితో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ‘బిగ్‌బాస్’ హిస్టరీలోనే ఇది తొలిసారి. ఇలా ఇద్దరు భార్యలతో షోలో పాల్గొనడాన్ని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దేవోలినా భట్టాచార్జితో పాటు పలువురు తప్పు పట్టినా.. ఆర్మాన్ మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నాడు.
తమ మధ్య ఎలాంటి వివాదాలు రావని.. ఒక ఫ్యామిలీగా ఎలా ఉంటామో చూపించడానికే బిగ్‌బాస్‌లోకి వచ్చానని ఆర్మాన్ చెబుతున్నాడు. అంతేకాదు అభిమానులకు తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది.. నా వ్యక్తిత్వం ఎలాంటి అని తెలియజేసేందుకు ఈ షో బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. తనదైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకొని..కప్ కొడతానని ఆర్మాన్ చెప్పుకొచ్చాడు. మరి ఇద్దరి భార్యలతో కలిసి ఆర్మాన్ ఎలా ఆడతాడు? ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనేది మున్ముందు తెలుస్తుంది.
అలా ప్రేమలో పడి..
ఆర్మాన్, పాయల్‌ది ప్రేమ వివాహం. పాయల్ ఓ బ్యాంకు ఉద్యోగిణి. ఓ సందర్భంలో బ్యాంకులోకి వెళ్లిన ఆర్మాన్..తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆరో రోజుల్లోనే తన ప్రేమను వ్యక్తం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల పాటు కలిసి జీవించారు. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ క్రితికా మాలిక్‌తో ప్రేమలో పడిపోయాడు. ఆమె పాయల్‌కు బెస్ట్ ఫ్రెండ్. పాయల్ ద్వారనే ఆర్మాన్‌కి పరిచయం అయింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పాయల్‌కు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ముగ్గురి మధ్య గొడవలు కూడా జరిగాయి. చివరకు పాయల్ అంగీకరించడంతో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టారు. పాయల్‌కి ముగ్గురు సంతానం కాగా, కృతిక ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్ల పాటు ఈ ముగ్గురు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి పంజాబ్‌లోని చండీగఢ్‌లో నివసిస్తున్నారు.
తొలిసారి అనిల్ కపూర్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1కి కరణ్ జోహార్.. సీజన్ 2కి సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3కి కూడా సల్మానే హోస్ట్ అని అంతా భావించారు. కానీ సీనియర్ హీరో అనిల్ కపూర్‌ని హోస్ట్‌గా పరిచయం చేసి షాకిచ్చారు. ఈ సీజన్ 3లో వడపావ్ గర్ల్ చంద్రికా దీక్షిత్, నటుడు రణ్‌వీర్ ష్రాయ్, శివానీ కుమారీ, బాక్సర్ నీరజ్ గోయట్, ప్రముఖ లాయర్ సనా మక్బూల్ ఖాన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ విశాల్ పాండే, లవ్ కేష్ కటారియా పాల్గొన్నారు. ప్రముఖ ఓటీటీ ‘జియో సినిమా’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment