Bigg Boss Telugu 5, Episode 82: Siri Mother Warns Siri, Maanas Mom Entertain Housemates - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: హగ్గుల గురించి తీయకు.. తల్లిగా చెప్పడం నా బాధ్యత.. ఏడ్చేసిన షణ్ను

Published Fri, Nov 26 2021 12:04 AM | Last Updated on Fri, Nov 26 2021 10:52 AM

Bigg Boss Telugu 5: Siri Mother Warns Siri, Maanas Mom Entertain Housemates - Sakshi

Bigg Boss Telugu 5, Episode 82: కుటుంబ సభ్యుల ఎంట్రీతో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆనందం తాండవం చేసింది. హౌస్‌మేట్స్‌ అందరూ వచ్చిన అతిథులను చూసి తెగ సంతోషపడ్డారు. నెక్స్ట్‌ ఎవరు వస్తారా? అని ఎవరికివారు ఆశగా గేట్ల వంక చూశారు. నిన్న కాజల్‌ ఫ్యామిలీ హౌస్‌లో సందడి చేయగా నేడు శ్రీరామ్‌, మానస్‌, సిరి ఇంటిసభ్యులు వచ్చారు. మరి వాళ్లేం అన్నారు? హౌస్‌లో ఎంత రచ్చ చేశారన్నది నేటి (నవంబర్‌ 25) ఎపిసోడ్‌లో చూసేద్దాం..

శ్రీరామ్‌ కోసం ఆమె సోదరి అశ్విని హౌస్‌లోకి వచ్చింది. అందరితో పలకరింపులు అయిపోయాక శ్రీరామ్‌కు గేమ్‌లో సలహాలు సూచనలు ఇచ్చింది. నీ పాయింట్‌ నువ్వు చెప్పు, కానీ ఎదుటివాళ్లు చెప్పేది కూడా వినమని సూచించింది. నిన్ను గెలిచి రమ్మని బామ్మ మరీమరీ చెప్పిందని అది నిజం చేసి రావాలంటూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తర్వాత మానస్‌ తల్లి పద్మిని హౌస్‌లో అడుగు పెట్టింది. వచ్చీరావడంతోనే హౌస్‌ అంతా చుట్టేస్తూ తెగ సందడి చేసింది.

మానస్‌తో పర్సనల్‌గా మాట్లాడుతూ.. నీ దృష్టంతా టాప్‌ 5లో చేరడంపైనే ఉండాలని నొక్కి చెప్పింది. నిన్ను విన్నర్‌గా చూడాలనుకుంటున్నానని మనసులోని మాటను బయటపెట్టింది. పక్కవాళ్లు డిస్టర్బ్‌ చేస్తున్నా డిస్టర్బ్‌ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావని ధైర్యం నూరిపోసింది. ఇక తనను హౌస్‌మేట్స్‌ ఆంటీ అని పిలవగా అక్క అని పిలవండని సూచించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అందరికంటే పింకీ అందంగా కనిపిస్తుందని ఆమెను మెచ్చుకుంది.

శ్రీరామ్‌.. తనకు, మానస్‌కు మీలాంటి ఒక అమ్మాయిని చూడమని రిక్వెస్ట్‌ చేయగా శ్రీదేవి.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తానంది. అంతలోనే హమీదా వెయిట్‌ చేస్తోందిలే అంటూ పంచ్‌ విసిరింది. ఆమె ఎనర్జీకి మంత్రముగ్ధుడైన శ్రీరామ్‌ నీవన్నీవే, నీవే.. అంటూ అందమైన పాట పాడాడు. తర్వాత ఆమె అందరికీ వీడ్కోలు పలుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బీబీ ఎక్స్‌ప్రెస్‌ టాస్క్‌లో భాగంగా షణ్ను పాజ్‌లో ఉన్నప్పుడు హౌస్‌మేట్స్‌ అతడికి గర్భవతి వేషం వేయగా, సిరికి మీసాలు దించి ఆటపట్టించారు. 

అనంతరం సిరి తల్లి శ్రీదేవి హౌస్‌లోకి రాగా షణ్ముఖ్‌ను నువ్వు హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పింది. తండ్రి లేని పిల్ల కదా! షణ్ముఖ్‌ తండ్రిగా, అన్నగా అన్ని రకాలుగా సాయం చేస్తూ దగ్గరవుతుండటం నచ్చలేదంది. దగ్గరవడం మంచిదే కానీ హగ్గులు నచ్చట్లేదని చెప్పగా సిరి టాపిక్‌ డైవర్ట్‌ చేస్తూ ఆమెను పక్కకు తీసుకెళ్లింది. హగ్‌ చేసుకోవడం నచ్చలేదని ఎందుకలా అన్నావు? అలా అనకూడదు కదా! ఫీలవుతారు అని ఆగ్రహించింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి. అందరిముందు కాకుండా నాకు పర్సనల్‌గా చెప్పాల్సిందని సిరి నొచ్చుకుంది.

నువ్వెలాగో టాప్‌ 5లో ఉంటావంటున్నారు, కానీ నువ్వు మాత్రం కప్పు పట్టుకునే రావాలి అని సిరికి మరీమరీ చెప్పింది ఆమె తల్లి. తర్వాత తన కష్టాలు చెప్పుకుంటూ బాధపడింది. 'సిరికి ఊహ తెలిసినప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్‌ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. నన్ను సిరి తల్లిగా గుర్తిస్తున్నారు. ఆమెకు తల్లినయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను' అని చెప్పుకొచ్చింది. 

ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి హగ్‌ చేసుకుని ఏడవగా షణ్ను ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా గేమ్‌ కూడా వదిలేసి ఇంత సపోర్ట్‌ చేస్తే ఆమె తల్లితో ఇలా మాట పడాల్సి వచ్చిందని ఫీలయ్యాడు. అలా హగ్గులు నచ్చలేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే కుమిలిపోయాడు.

మరోవైపు తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రియాంక మానస్‌ను నిలదీసింది. నువ్వు నా దగ్గరనుంచి ఎక్కువగా ఆశిస్తున్నావని, నేను ఫ్రెండ్‌గా వచ్చి మాట్లాడితే నీకు ఇంతేనా అనిపిస్తుందంటూ ఆమెను ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. మానస్‌ చెప్పేది అర్థం అయిందో లేదో తెలియదు కానీ వెంటనే పింకీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. అనంతరం సన్నీ తల్లి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. తన బర్త్‌డేను హౌస్‌మేట్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోనుంది. ఆ సెలబ్రేషన్స్‌ రేపటి ఎపిసోడ్‌లో ప్రసారం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement