
Bigg Boss Telugu 5, Episode 23: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం నామినేషన్స్. ఈ నామినేషన్స్‌లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది. నామినేట్ కాని ఇంటిసభ్యులు ఎంచక్కా జాలీగా గడుపుతూ ఇంకో వారం దాకా మన బెర్త్‌కు ఏ ఢోకా లేదని ధీమాగా ఉంటారు. నేటి(సెప్టెంబర్ 27) ఎపిసోడ్‌లో నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు ఇంటిసభ్యులు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం...
నువ్వంటే ఇష్టం, ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు: హమీదా
లహరి విషయంలో అమ్మ మీద ఒట్టేసి అబద్ధం ఎలా చెప్పానని యాంకర్ రవి తనలో తానే మథనపడ్డాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అతిథి బేబీ బొమ్మను బిగ్‌బాస్ తిరిగి తీసుకున్నాడు. ఇక హమీదా.. నువ్వంటే నాకిష్టం, నీకు ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు అంటూ మరోసారి శ్రీరామ్ దగ్గర ప్రేమ ఊసులు మాట్లాడింది. అతడు మాత్రం ఇంకా వివరంగా చెప్పంటూ అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగోవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
చెప్పు తీసుకుని కొట్టు వింటాను, కానీ..: లోబో
మొదటగా వచ్చిన ప్రియ.. తనతో సరిగా ఉండట్లేదని లోబో, మానస్‌ను నామినేట్ చేసింది. విశ్వ.. రవి, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. లోబో.. నేను లైఫ్‌లో ఒకే ఒక అమ్మాయిని ప్రేమించా. నా లవ్ గురించి చెప్తుంటే నువ్వు అది సినిమా స్టోరీలా ఉందన్నావు. ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ ప్రియపై గయ్యిమని అరిచాడు. అతడు తన మీదకు అలా దూసుకురావడంతో షాకైన ప్రియ.. నాపై అరిచే హక్కు నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది.
ఆ టైంలో ఆకలేంటి?: లోబో
అయినప్పటికీ వెనక్కు తగ్గని లోబో.. నేను ప్రేమించిన, టైంపాస్ చేయలే, అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చిన అని చెప్తుండగా మధ్యలో అడ్డుకున్న ప్రియ.. తెలుస్తుంది అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో అని కౌంటరిచ్చింది. జనాలవల్లే తానీ స్టేజీలో ఉన్నానంటూ అరిగిన టేపు రికార్డర్‌లా చెప్పిందే మరోసారి చెప్పాడు లోబో. అంతలోనే ఆకాశం వంక చూసి ఏడ్చేయడంతో రవి అతడిని ఓదార్చాడు. ఈ సీన్ చూసిన ప్రియ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దు అని చురకలంటించింది. తర్వాత అతడు సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ లవ్‌స్టోరీ చెప్తుండగా ఆకలేస్తోంది అని ఎలా అనగలిగావని విమర్శించాడు.
ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాననకు: చిరాకు పడ్డ షణ్ముఖ్
శ్రీరామ్.. లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన శ్వేత, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. తర్వాత షణ్ముఖ్.. మీ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లోబోను నామినేట్ చేశాడు. దీంతో లోబో మరోసారి తను పేదవాడినంటూ ఫ్లూటు వాయించాడు. దీంతో చిర్రెత్తిపోయిన షణ్ను ప్రతిసారి బస్తీ నుంచి, కింది నుంచి వచ్చానని చెప్పొద్దు, అందరం అక్కడి నుంచే వచ్చామంటూ అతడి నోరు మూయించాడు. తర్వాత వచ్చిన కాజల్.. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారని నటరాజ్ మాస్టర్‌ను, సేఫ్ గేమ్ ఆడొద్దంటూ సన్నీని నామినేట్ చేసింది.
మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండి: మానస్ హెచ్చరిక
లోబో ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ తెలీదు, అప్పుడప్పుడు కామెడీ కూడా లిమిట్ దాటుతుంది. మీరు సింపథీకి ట్రై చేస్తున్నారనిపిస్తోందంటూ సిరి లోబోను, తర్వాత యానీ మాస్టర్‌ను నామినేషన్‌లోకి పంపించింది. మానస్.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయగా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు మాట్లాడినప్పుడు మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండని మానస్ హెచ్చరించాడు. అసభ్యకరమైన భాష వాడొద్దని లోబో ఫొటోలో నుంచి ఓ ముక్కను విసిరేశాడు. శ్వేత.. లోబో, రవిని; హమీదా.. లోబో, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు.
డైరెక్ట్‌గా చేయి పెట్టడం నచ్చలేదు: ప్రియాంక సింగ్
నటరాజ్ మాస్టర్.. అతిగా నటించకూడదు, నువ్వు వీక్ అనిపిస్తోంది అంటూ విశ్వను చిన్నచూపు చూస్తూ నామినేట్ చేశాడు. నువ్వెవరివి నన్ను నటిస్తున్నావని డిసైడ్ చేయడానికి అని విశ్వ ఫైర్‌కావడంతో మాస్టర్ మీసం మెలేస్తూ మరింత రెచ్చగొట్టాడు. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదకరమే, అది అడవిలో ఉంటది, ఇది బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటుంది' అని డైలాగులు వల్లె వేయడంతో కాజల్ ఫక్కున నవ్వేసింది. మీకోసం వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అవుతుందన్న ఆలోచనే తప్పని నొక్కి చెప్పింది, కానీ అతడు వినిపించుకోనేలేదు. ఇక తనను ఇన్‌ఫ్లూయెన్స్ చేయొద్దని హెచ్చరిస్తూ రవిని నామినేట్ చేశాడు మాస్టర్. ప్రియాంక సింగ్.. సోఫాలో నిలబడ్డప్పుడు మీరు డైరెక్ట్‌గా చేయి పెట్టారు. అది నాకు నచ్చలేదంటూ లోబోను తర్వాత కాజల్‌ను నామినేట్ చేసింది.
పశ్చాత్తాపంతో కుమిలిపోయిన యాంకర్ రవి
అనంతరం వచ్చిన రవి.. అందరి ముందుకు రావాలంటేనే సిగ్గుగా ఉందని తలదించుకున్నాడు. శనివారం నా జీవితంలోనే వరస్ట్ రోజు. నేను ముగ్గురికి.. ప్రియ, లహరి, అమ్మకు సారీ చెప్తున్నాను. ప్రియకు చెప్పిన మాటను చెప్పలేదంటూ అమ్మ మీద ఒట్టేశాను అని బాధతో పశ్చాత్తాపపడ్డాడు. తనను కొట్టిందంటూ కాజల్‌ను, మీరు గుంటనక్క అని తననే అన్నారంటూ నటరాజ్ మాస్టర్‌ను రవి నామినేట్ చేశాడు. తర్వాత యానీమాస్టర్ తనను నామినేట్ చేసిన శ్రీరామ్, సిరి ఫొటోల ముక్కలు పూల్‌లో వదిలేసింది. సన్నీ.. తనను పదేపదే సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న ప్రియ, కాజల్‌ను; జెస్సీ.. ప్రియాంక, రవిని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ నాలుగో వారం నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.



Comments
Please login to add a commentAdd a comment