
టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం. యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని సెలబ్రిటీలను కలుస్తూ ఉంటాడు. సినిమా వాళ్లను కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో, రీల్స్ చేస్తాడో అనుకునేరు... తనదైన స్టైల్‌లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడతాడు. పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమా ప్రమోషన్స్ చేస్తాడు. మొదట్లో జబర్దస్త్ షోలోనూ మెరిసిన ఇతడు ప్రస్తుతం మాత్రం యూట్యూబ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు.
థర్మల్ ఇంజనీరింగ్‌లో తేజ ఎంటెక్ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా చేశాడు. కానీ యూట్యూబ్‌లో ఎంటరై పూర్తి స్థాయిలో భోజనప్రియుడిగా మారాడు. 'మొరగని కుక్క లేదు, విమర్శించని జనమూ లేరు. ఈ రెండూ లేని ఊరే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి.. అర్థమైందా రాజా.. ఆటకు రెడీ ఈ తేజ' అంటూ బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు తేజ. మరి ఇతడికి తినడం వచ్చు, కానీ వండటం ఏమేరకు వచ్చన్నది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.