ఓ పిల్లాడు సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా నాకేదైనా కొత్త వంట చేసి పెట్టు అని తల్లిని అడిగాడు. ఇంట్లో పొద్దున వండిన ఇడ్లీలు తప్ప ఏమీ లేవు. దాంతో తల్లి ఆ ఇడ్లీలను తుంచి వేపుడు చేసి బిడ్డకు పెట్టింది. తల్లి తన కోసం కొత్త వంట చేసిందని సంబరపడిపోయి ఆనందంగా తిన్నాడు ఆ బిడ్డ. ఇక్కడ తల్లి పాత్ర బిగ్ బాస్ అయితే బిడ్డ పాత్ర ప్రేక్షకులు. ఇక ఇడ్లీలు కంటెస్టెంట్లు అని వేరేగా చెప్పకరలేదు.
బిగ్ బాస్ 8 లిమిట్ లెస్ ఎంటర్ టైన్‌మెంట్ అని టాగ్ లైన్‌తో ఊదరగొట్టిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లు లిమిట్ లెస్ ఎంటర్ టైన్‌మెంట్ ఏమో గాని లిమిట్ లెస్ కన్ఫ్యూజన్ మాత్రం చూస్తున్న ప్రేక్షకులను గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తున్న(లేక చేస్తున్న) ఎంటర్ టైన్‌మెంట్ సరిపోలేదో (సరిరాదో) ఏమో కాని ఉన్నపళాన వారం వ్యవధిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి మరో 8 పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపాడు బిగ్ బాస్. ఆదిత్య ఓం, నైనిక ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో వున్నారు.
ఒక ఎలిమినేషన్ (ఆదిత్యఓం) హౌస్ మొత్తం కలిసి తీసుకున్నదైతే మరో ఎలిమినేషన్ మాత్రం (నైనిక) బిగ్ బాస్ చేసింది. ఇక వైల్డ్ కార్డ్ పేరిట ఓ 8 పాత కంటెస్టెంట్లను రంగంలోకి దింపిన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంపిక లో మాత్రం పెద్దగా ఆసక్తి కనబరిచినట్టుగా లేదు. కంటెస్టెంట్లు దొరక్కో లేక పాత కంటెస్టెంట్ల అందుబాటులో వున్నందుకో కాని పెద్దగా ఉత్సాహాన్నిచ్చే కంటెస్టెంట్లు లేరనే అనిపిస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లలో ఈ పాత కంటెస్టెంట్లైన కొత్త వైల్డ్ కార్డ్స్ ఉన్న కంటెస్టెంట్లతో ఎలా ఆడతారో ఈ పాత కొత్త ఆటను ఆస్వాదించే ప్రేక్షకులకు తెలియాలి. ఆఖరుగా ఒక్క మాట 'కొత్తొక వింత పాతొక రోత' అన్న నానుడి సదరు బిగ్ బాస్ కు తెలిసో లేదో...!!
-ఇంటూరి హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment