వేరే భాషల్లో స్టార్‌ హీరోయిన్లు.. తెలుగు తెరపై వాలిపోతున్నారు | Bollywood Heroine To Enter Tollywood | Sakshi
Sakshi News home page

వేరే భాషల్లో స్టార్‌ హీరోయిన్లు.. తెలుగు తెరపై వాలిపోతున్నారు

Published Sat, Feb 10 2024 12:18 AM | Last Updated on Sat, Feb 10 2024 7:13 AM

Bollywood Heroine To Enter Tollywood - Sakshi

ప్రతీ ఏడాదీ తెలుగు తెరపై కొత్త తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది కూడా కొందరు సొగసరులు టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. కొందరు ఇప్పటికే వేరే భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లి, తెలుగు తెరకు కొత్త తారగా పరిచయం అవుతున్నారు. ఇంకొందరు వేరే భాషల్లో ఇప్పుడిప్పుడే పైకొస్తూ తెలుగుకి వస్తున్నారు. ‘సొగసరీ... స్వాగతం’ అంటూ వీరి రాక కోసం తెలుగు తెర వేచి చూస్తోంది. 

మోస్ట్‌ వాంటెడ్‌  
హిందీలో పదిహేనేళ్లకు పైగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో భాగమయ్యారు దీపికా పదుకోన్‌. కానీ తెలుగులో స్ట్రయిట్‌ మూవీ చేయలేదు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం దీపికాను తెలుగుకు ఆహ్వానించింది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. ఇక ‘హెలెన్‌’, ‘కప్పెలా’ వంటి మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అన్నా బెన్‌ కూడా ‘కల్కి 28 98ఏడీ’తోనే తెలుగుకు ఎంట్రీ ఇస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్‌ కానుంది. 

స్వాగతం బంగారం 
దివంగత ప్రముఖ తార శ్రీదేవికి ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన బోలెడంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె వారసురాలిగా ముందు ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ఎంట్రీని తెలుగు ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. ‘దేవర’ సినిమాతో అది నెరవేరుతోంది. ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘దేవర’లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో జాన్వీ పాత్ర పేరు తంగమ్‌ (బంగారం). కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. అలాగే రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోనూ జాన్వీ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యారని సమాచారం. 

ఈసారి నో డౌట్‌ 
హీరోయిన్‌ మాళవిక ఎంట్రీ టాలీవుడ్‌లో ఎప్పుడో జరగాల్సింది. విజయ్‌ దేవరకొండ, మాళవికా మోహనన్‌ జంటగా ఓ సినిమా ్రపారంభమై, అది క్యాన్సిల్‌ అయ్యింది. ఈ బ్యూటీ ఇప్పుడు ‘రాజా సాబ్‌’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది.  

బచ్చన్‌కు జోడీగా.. 
హిందీ చిత్రం ‘యారియా 2’లో ఓ చిన్న పాత్ర చేసి పెద్ద పేరు తెచ్చుకున్నారు భాగ్య శ్రీ భోర్సె. ఈ పుణే మోడల్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగుకు పరిచయం కానున్నారు. హీరో రవితేజ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు భాగ్య శ్రీ భోర్సె. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానున్నట్లుగా తెలిసింది. 

ప్రపంచ సుందరి కూడా...
2017లో మిస్‌ వరల్డ్‌గా నిలిచిన బాలీవుడ్‌ బ్యూటీ మానుషీ చిల్లర్‌ కూడా తెలుగు తెరపై కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మానుషీకి తెలుగులో తొలి చిత్రం. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు శక్తీ ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న రిలీజ్‌ కానుంది. ఇది వరుణ్‌ తేజ్‌కు హిందీలో తొలి చిత్రం కావడం విశేషం. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, రినైసన్స్‌ పిక్చర్స్‌ పతాకాలపై సందీప్‌ ముద్దా ఈ సినిమాను నిర్మించారు.  

నాట్యం టు నటన 
నాట్య కళాకారిణి ప్రీతీ ముకుందన్‌ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు తెరపై నటిగా కనిపించనున్నారు. విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ముఖేష్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ప్రీతీ ముకుందన్‌ను తీసుకున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్మెంట్స్‌లపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్‌ కానుంది. 

బుజ్జి కన్నా.. వస్తున్నా... 
తెలుగు ప్రేక్షకులకు ‘బుట్ట బొమ్మ’ అంటే పూజా హెగ్డే, ‘బేబమ్మ’ అంటే కృతీశెట్టి గుర్తొస్తారు. అలాగే ‘బుజ్జి కన్నా’ అంటే మలయాళ బ్యూటీ ఇవానా గుర్తొస్తారు. తమిళ హిట్‌ ‘లవ్‌ టుడే’లో హీరోయిన్‌ ఇవానా ‘బుజ్జి కన్నా..’ అంటూ ప్రేమికుడిపై కురిపించిన ప్రేమ అందర్నీ ఆకట్టుకుంది. ‘లవ్‌ టుడే’ చిత్రం తెలుగులో అనువాదమై బంపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో తెలుగులో ఇవానాకు చాన్స్‌లు దక్కాయి. అలా స్ట్రెయిట్‌ ఫిల్మ్‌ ‘సెల్ఫిష్‌’తో ‘బుజ్జికన్నా.. వస్తున్నా!’ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులను మరో మారు గెలిచేందుకు వస్తున్నారు ఇవానా. ఇందులో ఆశిష్‌ హీరోగా నటిస్తున్నారు. విశాల్‌ కాశీ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. 

తెలుసు కదా... 
యశ్‌ ‘కేజీఎఫ్‌’ ఫ్రాంచైజీతో కన్నడలో, విక్రమ్‌ ‘కోబ్రా’తో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు మంగుళూరు బ్యూటీ శ్రీనిధీ శెట్టి. ఈ యంగ్‌ బ్యూటీ ‘తెలుసు కదా’ అంటూ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, రాశీ ఖన్నా మరో హీరోయిన్‌. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

డాటర్‌ ఆఫ్‌ జానీ లీవర్‌  
బాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్‌ కుమార్తె జెమీ లీవర్‌ హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమకు వస్తున్నారు. ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘భూత్‌ పోలీస్‌’ వంటి హిందీ సినిమాల్లో మెరిసిన జెమీ లీవర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. రామ్‌ అంకం దర్శకత్వంలో రాజీవ్‌ చిలక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘నా మాతృభాష తెలుగులో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఓ విధంగా మా గ్రాండ్‌ మదర్‌కు నేను ఇస్తున్న ఓ నివాళిగా ఈ సినిమాను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు జెమీ. ఇక బాలీవుడ్‌ సినిమాల్లో పాపులర్‌ అయిన జానీ లీవర్‌ స్వస్థలం కనిగిరి అనే విషయం తెలిసిందే.  ఈ ఏడాది ఇంకెంత మంది కొత్త సొగసరులకు తెలుగు పరిశ్రమ స్వాగతం పలుకుతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement