సినిమా ఒక మాయ ప్రపంచం... తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. కెరీర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడవుట్ అయితే పట్టించుకొనే నాధుడే ఉండడు. వెండితెరపై తిరుగులేని స్టార్డమ్ అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ విమీ ఒకరు. కానీ ఆమె మరణం చాలా మందిని కలిచివేసింది. సినీ ప్రపంచంలో తనకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. కానీ ఆమె విజయం స్వల్పకాలికం అయింది. ఈ రోజు, ఆమె పేరు ఎవరికీ గుర్తుండదు కూడా.. కానీ ఇండియన్ సినీ ప్రపంచంలో బాగా బతికి ఆపై అత్యంత దుర్భర స్థితిలో మరిణించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నటి విమి జీవితం విభిన్నం.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన విమి. ముంబైలోని సోఫియా కాలేజీ నుంచి సైకాలజీలో పట్టభద్రురాలు. ఆమె చదువు తర్వాత మల్టీ మిలియనీర్ అమీర్‌చంద్ ప్యారేలాల్ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త శివ్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రమేయంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన నటన,అందానికి ఫిదా అయిన బాలీవుడ్ అవకాశం ఇచ్చింది. అబ్రూ, హమ్రాజ్, పతంగా వంటి హిందీ సినిమాలలో నటించింది. వీటితో మంచి గుర్తింపు దక్కింది. తర్వాత సునీల్ దత్ నటించిన హమ్రాజ్ సినిమాతో స్టార్‌డమ్ తెచ్చుకుంది. తన కెరీర్‌లో సునీల్ దత్, శశికపూర్, రాజ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో కలిసి పనిచేసిన అతికొద్ది మంది నటీమణులలో విమీ కూడా ఒకరు.
60వ దశకంలోనే విమీ ఒక్క సినిమాకు రూ.3 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేది. భారీ సినిమా అవకాశాలతో పాటు డబ్బు,పేరు అన్ని విమి వద్దకు వచ్చాయి. అదె సమయంలో తను టెక్స్‌టైల్ వ్యాపారాన్ని కూడా స్థాపించింది. తన భర్త కూడా పారిశ్రామికవేత్త కావడంతో వ్యాపార సామ్రాజ్యాన్ని సులువుగా స్థాపించింది. కొద్దిరోజుల తర్వాత తన భర్త శివ్ అగర్వాల్‌తో గొడవలు రావడం మొదలయ్యాయి. తన పట్ల అనుమానం పెరగడంతో విపరీతంగా కొట్టేవాడని విమి ఒంటరి జీవితాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. భర్త శివ నుంచి విడిపోయిన కొద్దిరోజులకు నిర్మాత,నటుడు జాలీతో విమి ప్రేమలో పడింది. అతనితో సహజీవనం చేసింది. కానీ వివాహబంధాన్ని, పిల్లల్ని పదేపదే గుర్తుచేసుకుంటూ మద్యానికి బానిసైంది.
విమి కెరీర్ పతనం
హుమ్రాజ్ సినిమా తర్వాత, విమి యొక్క తదుపరి చిత్రం అబ్రూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అదేవిధంగా, శశి కపూర్‌తో ఆమె నటించిన 'పతంగ' కూడా జనాలను ఆకట్టుకోలేకపోయింది. విమి పంజాబీ హిట్ చిత్రం, నానక్ నామ్ జహాజ్ హైలో కనిపించింది. కానీ అది ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇలా వరుస పరాజయాలు విమి కెరీర్‌పై ప్రభావం చూపాయి. తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి. దీంతో ఆమెను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. భర్త, పిల్లలకు దూరం అయ్యాననే బాధ మరోవైపు. చేసేదేమి లేక తన వ్యాపార సంస్థ అయిన విమి టెక్స్‌టైల్స్‌ను అమ్మి అప్పులు తీర్చి దివాలా తీసింది. ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో ప్రియుడే ఆమెను చివరకు వ్యభిచారం వైపు నెట్టేశాడు. అలా తన చివరి రోజుల్లో అదె వృత్తిలో కొనసాగింది.
విమి యొక్క విషాద మరణం
విచ్ఛిన్నమైన వివాహం, విఫలమైన బాలీవుడ్ సినిమా కెరీర్, లైంగిక దోపిడీ ఇవన్నీ విమి జీవితాన్ని ఎంతగానో మార్చేశాయి. ఒకప్పుడు మహిళా సూపర్‌స్టార్‌గా వెలిగిన ఈ నటి అత్యంత పేదరికంలో 30 ఏళ్ల వయసులోనే మరణించింది. విమి కాలేయ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక సంక్షోభం మధ్య ముంబయి నానావతి హాస్పిటల్‌లోని జనరల్ వార్డులో చేరింది. చికిత్స పొందుతూ అక్కడ విమి మరణించింది. ఆమె బతికున్నప్పుడు ఆమె చుట్టూ ఎంతోమంది అభిమానులు, కార్లు,డబ్బు,పని మనుషులు ఉండేవారు.
కానీ ఆమె మరణం తర్వాత కనీసం ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కూడా ఒక్కరు లేరు. స్టార్‌డమ్ ఉన్నప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన ఆమె.. మరణం తర్వాత మృతదేహాన్ని ఒక తోపుడు బండిపై ఆస్పత్రి సిబ్బందిలో ఒకరు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అలా ఆమె జీవితం ముగిసిపోయింది. తన చివరిరోజుల్లో కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాలేదు. ఒక అనాథగా తన జీవితాన్ని విమి ముగించింది. ఆమె మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత తన చివరి చిత్రం క్రోధి విడుదలైంది.
(ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment