టైటిల్: బబుల్ గమ్
నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు
నిర్మాత: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
డైరెక్టర్: రవికాంత్ పేరేపు
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
విడుదల తేదీ: 2023 డిసెంబర్ 29
నిడివి: 2h 27m
సుమ పేరు చెప్పగానే గలగలా మాట్లాడే యంకర్ గుర్తొస్తుంది. ఎంతోమంది హీరోల సినిమాల ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి హోస్టింగ్ చేసింది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు తన కొడుకుని హీరోగా లాంచ్ చేసింది. 'బబుల్ గమ్' పేరుతో తీసిన సినిమా సుమ కొడుకు రోషన్ హీరోగా నటించాడు. తాజాగా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు? హిట్టు కొట్టాడా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
ఆది(రోషన్ కనకాల) పక్కా హైదరాబాదీ కుర్రాడు. డీజే కావాలనేది గోల్. ఓరోజు పబ్‌లో అనుకోకుండా జాన్వీ(మానస చౌదరి)ని చూస్తాడు. నచ్చేస్తుంది. దీంతో ఆమెని ఫాలో అయిపోతుంటాడు. మరోవైపు జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్-రిలేషన్స్ అంటే పెద్దగా పడవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరూ చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే 'బబుల్ గమ్' స్టోరీ.
ఎలా ఉంది?
ఓ అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరి మధ్య ప్రేమ.. ముద్దులు, హగ్గులు.. కొన్నాళ్లకు గొడవలు.. ఇలా లవ్ స్టోరీలన్నీ దాదాపు ఒకే ఫార్మాట్‌లో ఉంటాయి. అయితే సినిమా ఎలా తీసినా సరే ఫైనల్‌గా ఎంటర్‌టైన్ చేసిందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో 'బబుల్ గమ్' పాసైపోయింది. యాంకర్ సుమ కొడుకు.. ఈ సినిమాలో హీరో కావడంతో చాలామంది దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ వచ్చినప్పుడే ఇది యూత్‌కి నచ్చే, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ సినిమా అని అర్థమైపోయింది.
ఫస్టాప్ విషయానికొస్తే.. కేవలం చెడ్డీతో బైక్‌పై హీరో అరుస్తూ, ఏడుస్తూ హైదరాబాద్ రోడ్‌పై వెళ్లే సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి కథ ఆరు నెలల వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా ఆదిత్య(రోషన్ కనకాల) ఎంట్రీ.. ఓ డీజే దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కనడం. ఎప్పుడూ తిట్టే తండ్రి, ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి.. ఓ ఇద్దరు ఫ్రెండ్స్.. అనుకోకుండా ఓసారి జాన్వీ(మానస చౌదరి)ని చూడటం, ఆమెతో అనుకోని విధంగా ప్రేమలో పడటం.. ఇలా పెద్దగా మెరుపుల్లేకుండానే ఫస్టాప్ అలా అలా వెళ్లిపోతుంది. ఓ డిఫరెంట్ సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
అయితే అసలు కథంతా సెకండాఫ్‌లోనే చూపిస్తారు. అప్పటివరకు ప్రేమకథగా ఉన్నది కాస్త రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్టాప్ అంతా సరదసరదాగా ఉన్న హీరోహీరోయిన్.. సెకండాఫ్‌లో సీరియస్ డ్రామా పండిస్తారు. ఇక క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫ్యూజన్‌గా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది.
'బబుల్ గమ్' అని టైటిల్ కి తగ్గట్లే ఫస్టాప్ అంతా సాగదీసి వదిలిన డైరెక్టర్.. సెకండాఫ్ మాత్రం మంచిగా తీశాడు. దీంతో ఓ ఫీల్ గుడ్ మూవీ చూసినట్లు అనిపిస్తుంది. అయితే కొత్త యాక్టర్స్‌తో ఇలాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కమ్ డ్రామా తీస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఎక్కువే. అయితే డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయిపోయాడు. అలానే లస్ట్ తప్ప పెద్దగా ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్.. అక్కడక్కడ బూతు డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారు?
హీరోగా చేసిన రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ మూవీకే ఈ మాత్రం ఔట్‌పుట్ ఇచ్చాడంటే.. మంచి ఫ్యూచర్ ఉన్నట్లే. హీరోయిన్ మానస చౌదరి కూడా బాగుంది. రొమాంటిక్స్ సీన్స్‌లో రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో మాత్రం పర్వాలేదనిపించింది. ఇక హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ.. మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేశాడు. హర్షవర్థన్, అనుహాసన్ లాంటి సీనియర్స్ ఉన్నప్పటికీ పెద్దగా సీన్స్ పడలేదు.
టెక్నికల్ విషయాలకొస్తే.. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన రవికాంత్ పేరేపు.. 'బబుల్ గమ్' సినిమా విషయంలో కాస్త క్లారిటీ మిస్సయ్యాడు. కానీ కొత్తోళ్లు అయిన రోషన్, మానస దగ్గర నుంచి యాక్టింగ్ బాగానే రాబట్టుకున్నాడు. ఇందులో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 'జిలేబీ' పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు అయితే టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే యూత్‌ఫుల్ ప్రేమకథని చూడాలనుకుంటే 'బబుల్ గమ్' ట్రై చేయొచ్చు.
- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment