వయసుకు, మనసుకు సంబంధం లేదంటారు. అయితే వయసుకు, నటనకు సంబంధం లేదని నిరూపిస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఈయన వయసు జస్ట్ ఏడు పదులే. చేసిన చిత్రాలు 170. ప్రస్తుతం 169, 170 చిత్రాల్లో నటిస్తున్నారు. 169వ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, టాలీవుడ్ నటుడు సునీల్, తమిళ నటుడు యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
రజనీకాంత్‌కు సంబంధించిన షూటింగ్ 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అందులో ఒకటి జైలర్ పాత్ర. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెరపైకి తీసుకురానున్నట్టు తాజా సమాచారం. ఇక 169వ చిత్రం విషయానికొస్తే దీని పేరు లాల్ సలాం. ఇందులో రజనీకాంత్ అతిథిగా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. విష్ణువిశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ వారసురాలు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న దీన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇకపోతే రజనీకాంత్ 171వ చిత్రం కూడా ఖరారైనట్లు తాజా సమాచారం. దీనికి జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది జై భీమ్ చిత్రం మాదిరిగానే యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి లాఠీ పట్టనున్నట్లు సమాచారం. ఇంతకుముందు అన్బుక్కు నాన్ అడిమై, కొడి పరక్కుదు, నాట్టుక్కు ఒరు నల్లవన్, పాండియన్ ఇటీవల దర్బార్ చిత్రాల్లో పోలీస్ అధికారిగా నటించారు. దీంతో మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో దర్శకుడు జ్ఞానవేల్ బిజీగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
చదవండి: 10 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment