‘‘కలర్ ఫోటో’ సినిమా తర్వాత సీరియస్ యాక్ట్రెస్‌గా నాకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీ తర్వాత నా పనిని ఇంకా ఎలా మెరుగుపరచుకోవచ్చు అనే దానిపైనే దృష్టి పెడుతున్నాను. ‘గామి’ కథ విన్నప్పుడు కచ్చితంగా భాగం కావాలనిపించింది. నా మనసుకి చాలా తృప్తి ఇచ్చిన సినిమా ‘గామి’’ అని హీరోయిన్ చాందినీ చౌదరి అన్నారు. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన చిత్రం ‘గామి’. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 8న విడుదలకానుంది.
ఈ సందర్భంగా చాందినీ చౌదరి మాట్లాడుతూ–‘‘వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు.. ఇలా రియల్ లొకేషన్స్‌లో ‘గామి’ని చిత్రీకరించాం. షూటింగ్‌లో చాలా సవాల్‌తో కూడిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ప్రయాణం ఒక సాహస యాత్రలా జరిగింది. ఈ మూవీకి ఐదేళ్లు పట్టింది. అంత సమయం తీసుకున్నాం కాబట్టే విజువల్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. ఐమ్యాక్స్ స్క్రీన్‌లో మా మూవీ ట్రైలర్ చూసినప్పుడు మా కష్టానికి ప్రతిఫలం లభించిందనే ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. ‘గామి’ లాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. నేను నటించిన 4 చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌లోనూ నటించా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment