నాగచైతన్యను పెళ్లాడాక సమంత తన సోషల్ మీడియా ఐడీని ‘సమంత అక్కినేని’గా మార్చారు. అయితే రెండు నెలల క్రితం ఒక్క ఫేస్‌బుక్ తప్ప ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ‘ఎస్’గా మార్చడంతో చై–సామ్ విడిపోవాలనుకుంటున్నారనే చర్చలు మొదలయ్యాయి.
టాలీవుడ్ క్యూట్ కపుల్ అనిపించుకున్న నాగచైతన్య–సమంత విడిపోనున్నారనే వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఈ దంపతులు ఐదో వివాహ వార్షికోత్సవం (2017 అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం, 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చై–సామ్ వివాహం గోవాలో జరిగింది)లోకి అడుగుపెట్టనున్న తరుణంలో శనివారం తాము విడిపోతున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. ట్విట్టర్ ద్వారా నాగచైతన్య, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమంత ఒకే పోస్ట్‌ని షేర్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఈ విధంగా...
‘మా శ్రేయోభిలాషులందరికీ.... బాగా చర్చించుకుని, ఆలోచించుకున్న తర్వాత మేం వేరు వేరు దారుల్లో మా జీవితాన్ని సాగించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలనుకున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న పదేళ్ల స్నేహబంధాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ స్నేహబంధం ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన బంధం మా మధ్య ఎప్పటికీ ఉంటుందని నమ్ముతున్నాం. మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ఈ క్లిష్ట సమయంలో మాకు అండగా నిలవాలని, మేం ముందుకు వెళ్లడానికి ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాం’’ అని చై–సామ్ పేర్కొన్నారు.
నిజానికి ఈ ఇద్దరూ విడిపోవడం ఖాయం అనే వార్త ప్రచారంలో ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యే బోలెడన్ని వదంతుల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందని కొందరు భావించారు. ఇద్దర్నీ అభిమానించేవారు ‘ఇలా జరిగి ఉండాల్సింది కాదు’ అంటున్నారు.
ఈ పరిణామంపై నాగార్జున కూడా ట్విట్టర్ ద్వారా బాధను వ్యక్తపరిచారు. ‘‘బరువైన మనసుతో ఈ విషయం చెబుతున్నాను. సామ్, చై మధ్య ఏం జరిగిందో అది దురదృష్టకరం. ఒక భార్యాభర్త మధ్య జరిగేవన్నీ వారి వ్యక్తిగతం. అయితే సామ్, చై ఇద్దరూ నాకు చాలా ‘డియర్’. సామ్‌తో గడిపిన క్షణాలు మా కుటుంబానికి ఎప్పుడూ మంచి జ్ఞాపకాలే. తను ఎప్పుడూ మాకు దగ్గరగానే ఉంటుంది. ఆ దేవుడు ఈ ఇద్దరికీ తగినంత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని నాగార్జున ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే... సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నేను విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తాయి’ అంటూ షేర్ చేసిన ఒక స్టోరీ చర్చలకు దారి తీసింది. ‘‘చరిత్రలో ఎప్పుడూ గెలిచేది ప్రేమ, నిజాయతీలే. నియంతల, హంతకుల గెలుపు తాత్కాలికమే. అయితే వారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం’ అనేది ఆ ఇన్‌స్టా స్టోరీ సారాంశం. సమంత ఎవరిన్ని ఉద్దేశించి ఇలా అన్నారనే చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా చై–సామ్‌ల పెళ్లి మజిలీ ముగిసింది. ‘ఏ మాయ చేసావే’ (2010) ఈ ఇద్దరూ జంటగా నటించిన తొలి సినిమా. ఆ సినిమా అప్పుడే ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’లో నటించారు. ఇప్పుడు ఇద్దరి మజిలీ వేరు.
Comments
Please login to add a commentAdd a comment