ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో బాగా వినిపించిన మలయాళం సినిమాల్లో 'మంజుమ్మల్ బాయ్స్' ఒకటి. రూ.20కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.250 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ఇదే పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు.
ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాతలపై కేసు నమోదైంది. ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలైన సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ, బాబు షాహిర్‌ల మీద చీటింగ్ కేసు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆ నిర్మాతలు తనని మోసం చేశారంటూ సిరాజ్ వలియతార న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా కోసం తాను రూ.7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని సిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇస్తామని చెప్పడంతోనే పెట్టుబడి పెట్టినట్లు సిరాజ్ చెబుతున్నాడు. సినిమా భారీ విజయం అందుకున్న తర్వాత తనకు టచ్‌లో లేకుండా పోయారని ఆయన వాపోయాడు. లాభాల సంగతి పక్కనపెడితే తాను పెట్టిన రూ. 7 కోట్ల మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపాడు. పూర్తి విచారణ తర్వాత 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఎర్నాకుళం కోర్టు ఆదేశించింది.
2006లో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రాన్ని చిదంబరం తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్,శ్రీనాథ్ భాసి, గణపతి, ఖలీద్ రెహమాన్, జార్జ్ మరియన్ తదితరులు నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment