యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. సినీ పరిశ్రమలోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కరోనా ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది ఆప్తుల్ని, మిత్రుల్ని కోల్పోయాము. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందర్నీ కాపాడాలని ఆలోచన చేశాను. రోగం వచ్చాక బాధపడేకంటే రోగ నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. హెల్త్ కార్డుల కోసం అడిగితే యోధ లైఫ్ లైన్ చైర్మన్ సుధాకర్ సానుకూలంగా స్పందించారు. కేవలం మెంబర్స్‌కు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం అవకాశం కల్పించారు. మేమిచ్చే హెల్త్ కార్డ్, దీని క్యూఆర్ కోడ్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు 7,699 కార్డులు రెడీ అయ్యాయి. మిగతావన్నీ ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఒమిక్రాన్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. షూటింగ్‌లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌లో పాల్గొనాలి. ఆరోగ్య పరంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను.. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా..' అని చెప్పుకొచ్చారు.
అలాగే సినీ పరిశ్రమలోని వివాదాలపై స్పందిస్తూ.. 'పెద్దరికం చేయడం నాకిష్టం లేదు, నేను పెద్దగా ఉండను.. కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తాను. కానీ అనవసరంగా తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఇద్దరు వ్యక్తులో, రెండు యూనియన్లో కొట్టుకుంటుంటే మాత్రం ఆ పంచాయితీలు నేను చేయను. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు ఇబ్బంది. ఆ పెద్దరికమే నాకు వద్దు' అని చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment