‘‘ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. బలమైన కథనం ఉంటే పాటలు, ఫైట్లు లేకపోయినా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే ‘గాడ్ ఫాదర్’ సినిమా తీశాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తుండటం మంచి సంకేతంగా భావిస్తున్నాను. ఈ సినిమా హిట్ మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని హీరో చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి విలేకరులతో చెప్పిన విశేషాలు.
► ఇన్నేళ్ల మీ కెరీర్‌లో ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్‌ని చూశారు. ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత ప్రత్యేకమైనది?
నా కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ చూశాను. హిట్‌కి పొంగిపోయి, ఫ్లాప్‌కి కుంగిపోయే దశను నేను ఎప్పుడో దాటేశాను. సినిమా అనేది సమిష్టి కృషి.. అందుకే ఒక విజయం నాది అనుకోను. నా గత చిత్రం (‘ఆచార్య’) ప్రేక్షకులను నిరాశ పరిచింది.. అయితే ఆ మూవీకి నేను చేయాల్సిన ధర్మం చేశాను.. దాన్ని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తాన్ని (పారితోషికం) నాది కాదని వదిలేశాను.. అలాగే రామ్‌చరణ్ కూడా ఇచ్చేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లని కాపాడుతుందనే సంతృప్తి దక్కింది. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ హిట్ కూడా నాది అనుకోను.. యూనిట్ అందరిదీ.
► మలయాళ హిట్ మూవీ ‘లసిఫర్’కి రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చేయాలనే ఆలోచన ఎవరిది?
‘లూసిఫర్’లో చిన్న చిన్నమార్పులు చేస్తే ఈ కథ నాకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని రామ్‌చరణ్‌కి దర్శకుడు సుకుమార్ చెప్పాడు. చరణ్ నాతో ఆ మాట అనగానే ఆ సినిమా రెండోసారి చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో లేడు (నవ్వుతూ). ఆ తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. మోహన్‌రాజా పేరును చరణ్ చెప్పగానే నమ్మకం కలిగింది. రచయిత సత్యానంద్‌తో కలిసి టీమ్ అంతా చక్కని మార్పులు చేసి, ‘గాడ్ ఫాదర్’ని అద్భుతంగా మలిచారు. ఈ సినిమా చూసి నాగార్జున, వెంకటేష్, కొందరు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
► ‘గాడ్ ఫాదర్’లో పాటలు, డ్యాన్స్‌లు లేవు.. మీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?
ఇది చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్. పాటలు, డ్యాన్స్‌లు లేవని ఎక్కడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినప్పుడు పాటలు లేవనే ఫీలింగ్ కలగకుండా నేపథ్య సంగీతంతో తమన్ ప్రాణం పోశాడు. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సూచించింది కూడా తమనే.
► ఈ మూవీలో సత్యదేవ్, పూరి జగన్నాథ్, సర్వదమన్ బెనర్జీ పాత్రలు మీ ఎంపికేనా?
ఇందులో సీఎం పాత్రకి సర్వదమన్ బెనర్జీ అయితే బావుంటుందనుకున్నాం. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన మా కోరిక మేరకు నటించారు.. ఆ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నాకు, పూరి జగన్నాథ్‌కి మధ్య కాంబినేషన్ సీన్ ముందు అనుకోలేదు.. అయితే తను కావాలని అడగడంతో జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ పెట్టాం. సత్యదేవ్ కూడా అందరూ వావ్ అనేలా తన పాత్ర చేశాడు. నయనతార చాలా అద్భుతంగా చేసింది. సల్మాన్ ఖాన్ ఆలోచన మోహన్ రాజాదే. అయితే సల్మాన్‌తో రామ్ చరణ్ మాట్లాడటంతో నాపై ప్రేమతో ఒప్పుకున్నారు.
► ఓ వైపు సినిమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు. ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు?
ప్రేక్షకులు, ఇండస్ట్రీ నన్నెంతగానో ఆదరించింది. వారు ఇచ్చిన ప్రేమ, అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
► ఎందరో సీనియర్ దర్శకులతో పని చేశారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయడం ఎలా ఉంది?
గతంలో కంటే ఇప్పుడు సమాచారం అన్నది అపరిమితంగా దొరుకుతోంది. యువ దర్శకులు కొత్త విషయాలని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు.. దాన్ని చూపించడానికి వారికి పుష్కలమైన అవకాశాలున్నాయి. నా ఇమేజ్, వారు కొత్తగా చూపించే విధానం బాగుంటుందని నమ్ముతాను.. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను.
► ‘సైరా’ మీ కలల ప్రాజెక్ట్ అన్నారు.. అలాంటి పాత్రలు ఇంకా ఏవైనా చేయాలని ఉందా?
అలా ఏమీ లేదు. ‘సైరా’ సంతృప్తినిచ్చింది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌లో చేస్తున్న సినిమాలో నా నుండి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉంటాయి. అలాగే ‘బోళా శంకర్’లోనూ మంచి వినోదం ఉంటుంది. మీరు, పవన్ కల్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా? తమ్ముడితో సినిమా చేయాలనే ఉత్సాహం నాకు, అన్నయ్యతో చేయాలని తనకీ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా నిర్మించే ట్రెండ్ ఇప్పుడు తెలుగులో ఉంది. మంచి కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.
► సల్మాన్ మీ చిత్రంలో స్పెషల్ రోల్ చేశారు. వేరే భాషల్లో మీరు స్పెషల్ రోల్ చేస్తారా?
కథ, పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుకుంటాను. భాష, ప్రాంతీయ బేధాలు లేకుండా ఇండియన్ సినిమా అనే పేరు రావాలనేది నా కోరిక. ‘బాహుబలి, కేజీఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్’ త్రాలతో సౌత్, నార్త్ అనే హద్దులు చెరిగిపోయాయని భావిస్తాను.. ఇది మంచి పరిణామం.
► కొందరు దర్శకులు సెట్స్‌లో డైలాగులు రాస్తున్నారని ఆ మధ్య అన్నారు?
తప్పనిసరి పరిస్థితుల్లో సెట్స్‌లో డైలాగ్‌లు మార్చడంలో తప్పు లేదు. కానీ, ప్రీ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైమ్ తీసుకుని, బౌండెడ్ స్క్రిప్‌్టతో సెట్స్‌కి వెళితే సమయం, డబ్బు వృథా కావు. ఆ ఆలోచనతో ఆ మాట అంటే, కొందరు వేరేలా ఆపాదించుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని మోహన్ రాజా అద్భుతంగా చేశారు. దానివల్ల సెట్స్‌లో ఆలస్యం కాకుండా టైమ్, డబ్బు కలిసొస్తాయి.
► చాలా సందర్భాల్లో మీరే ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తారు.. ఎందుకిలా?
నిజాలు నిలకడగా తేలుతాయనే మాటని నమ్ముతాను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పుని తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా దగ్గరకి తీసుకుంటాను. నాకు తెలిసిన ఫిలాసఫీ ఇది. ఇక్కడ ఉన్నన్ని రోజులు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెంచుకున్నామన్నది ముఖ్యం కాదు.. ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం. ‘ప్రజారాజ్యం’ పార్టీ ఉండి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలో ఏదో ఒకదానికే పరిమితం అయ్యేవాణ్ణి. ఒక నటుడిగా రెండు రాష్ట్రాల ప్రజలు నన్ను బాగా ఆదరిస్తున్నారు.. అందుకు సంతోషంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment