మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్(టీడీఎమ్‌ఎఫ్) వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆదివారం TDMF వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి, విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'జీవితంలో దేనికీ షార్ట్‌కట్స్ ఉండవు. ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుని ఇక్కడికి వచ్చాను. నాకు జరిగిన ఓ సంఘటన మీతో పంచుకుంటాను.
సెట్‌లో అవమానం
న్యాయం కావాలి అనే సినిమా షూటింగ్.. నిర్మాత క్రాంతి కుమార్ ఓ క్రేన్‌లో పైన ఉన్నారు. నేను బయట ఉన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ పిలవడంతో నేను గబాగబా వచ్చి బోనులో నిల్చున్నాను. లోపలికి రాగానే క్రాంతికుమార్ అందరి ముందు అవమానిస్తూ మాట్లాడాడు. ఏంటండీ? మిమ్మల్ని కూడా పిలవాలా? ఇక్కడ వచ్చి పడుండలేరా? మీరేమైనా సూపర్ స్టార్లు అనుకుంటున్నారా? ఇక్కడ జగ్గయ్య, శారద వంటి యాక్టర్లు లేరా? ఇక్కడే ఉండండి అని అరిచేశారు. నాకు గుండె పిండేసినంత పనైంది.
అన్నం కూడా తినబుద్ధి కాలేదు
నేనేం తప్పు చేశాను? బయట నిల్చున్నాను, పిలవగానే లోపలికి వచ్చాను కదా! ఆయన పైన క్రేన్‌లో నిలబడి అరిచేసరికి సెట్‌లో ఉన్న అందరికీ ఆ మాటలు వినబడ్డాయి. మధ్యాహ్నం భోజనం కూడా చేయబుద్ధి కాలేదు. సాయంత్రం ఇంటికెళ్లాక క్రాంతికుమార్ ఫోన్ చేశారు. ఏదో ఒత్తిడిలో ఉండి ఆ కోపం నా మీద చూపించానన్నారు. కానీ అది పద్ధతి కాదు. అంతమంది ముందు ఎంత అవమానానికి గురయ్యాను. సూపర్‌స్టార్ అనుకుంటున్నావా? అన్న మాట నా మనసులో ఉండిపోయింది. నిజంగానే స్టార్‌నయి చూపిస్తానని ఆరోజే డిసైడయ్యాను. నాలో కసి పెరిగింది. ఆయనపై ప్రతీకారం తీర్చుకోకుండా ఆ అవమానాన్ని నా ఎదుగుదలకు వాడుకున్నాను. ఇలాంటివి చాలా జరిగాయి' అని చెప్పుకొచ్చాడు.
అయిపోయిన సబ్బు ముక్కలను
ఇంకా మాట్లాడుతూ.. 'మేము పెద్ద హీరోలమైనా సరే అయిపోయిన షాంపూ బాటిల్‌లో నీళ్లు పోసి దాన్ని వాడుకుంటాం. అలాగే నేను అయిపోయిన సబ్బు ముక్కలన్నీ కలిపి ఒక సబ్బుగా తయారు చేసి వారం రోజులవరకైనా వాడుతాను. నీటిని ఎక్కువగా వృథా చేయను. లైట్లు ఆఫ్ చేశారా? లేదా? అని ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాం. మీ అందరు కూడా ఇలాంటి చిన్నచిన్నవి పాటించాలి' అని చిరంజీవి సూచించాడు.
చదవండి: చిరంజీవితో సినిమా ఛాన్స్.. ఎందుకు కాదన్నాడో తొలిసారి చెప్పిన సిద్ధు
Comments
Please login to add a commentAdd a comment