టాలీవుడ్‌లో సంచలన సమావేశానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. కొంతకాలంగా ఉప్పు, నిప్పుల్లా వ్యవహరించిన చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదికకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు సంబందించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వివరాలివి..
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ముహుర్తం ఖరారైంది. ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆదివారం ఈ కీలక సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
ఇక ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబందించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలం తరువాత చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేధికపై కన్పించనుండటంతో ఈ సమావేశంపై ఉత్కఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment