
చిరంజీవి, నూపుర్ సనన్, రవితేజ, గాయత్రీ భరద్వాజ్
‘‘టైగర్ నాగేశ్వరరావు’ కథను ప్యాండమిక్ సమయంలో దర్శకుడు వంశీ చాలా అద్భుతంగా నాకు వినిపించారు. ఆ తర్వాత ఈ సినిమా చేసేందుకు నాకు సాధ్యపడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్టువర్టుపురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మయాంక్ సింఘానియా సహనిర్మాత. రేణు దేశాయ్, మురళీ శర్మ, షణ్ముఖి కీలక పాత్రధారులు.
ఉగాది సందర్భంగా జరిగిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మా నాన్న (కొణిదెల వెంకటరావు) గారు చీరాల పేరాలలో ఉద్యోగం చేశారు. ఆ పక్కనే స్టువర్టుపురం ఉండేది. అక్కడి వారంతా నాగేశ్వరరావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆసక్తితో నాన్నగారిని అడిగి నాగేశ్వరరావు గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు నాగేశ్వరరావు గురించి వంశీ కమర్షియల్‌గా కథను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రవితేజ చేస్తుండటం శుభం. ఇందుకు నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ పూనుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
మరో ముఖ్య అతిథి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘దర్శకుడు వివేక్ ‘కశ్మీర్ ఫైల్స్’తో భారతీయులందరికీ పండిట్‌ల కథను తెలిసేలా చేశారు. దేశానికి ఉపయోగపడే సినిమా తీసిన అభిషేక్‌ను అభినందిస్తున్నాను. ఇప్పుడు అభిషేక్ తీస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘రవితేజ ఈ సినిమా ఒప్పుకోవడం నాతో పాటు, మా టీమ్‌కు కూడా మంచి ఎనర్జీని ఇచ్చింది. రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరి హీరోల ఫ్యాన్స్ మెచ్చే చిత్రంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉంటుంది’’ అన్నారు వంశీ. ‘‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాగే ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment