సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్‌: చిరంజీవి | Chiranjeevi Talk About Victory Venkatesh At Celebrating Venky 75 Event | Sakshi
Sakshi News home page

విక్టరీ, రాజా, పెళ్లికాని ప్రసాద్‌, పెద్దోడు, వెంకీ మామ.. పిలుపు మారినా ప్రేమ తగ్గలేదు: వెంకటేశ్‌

Published Thu, Dec 28 2023 6:41 PM | Last Updated on Thu, Dec 28 2023 7:12 PM

Chiranjeevi Talk About Victory Venkatesh At Celebrating Venky 75 Event - Sakshi

‘వెంకటేశ్‌ తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్‌. . తన ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్‌, ప్రేమ కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. కలిసి సినిమా చేయాలనేది మా ఇద్దరి కోరిక. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది'అని మెగా​స్టార్‌ చిరంజీవి అన్నారు. విక్టరీ వెంకటేశ్‌ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని తాజాగా  ‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నారు వెంకీ. ఇప్పటికే అన్ని రకాల జానర్స్‌ని టచ్‌ చేశాడు. ఇకపై కూడా ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 

విక్టరీ వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘కలియుగ పాండవులు’తో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని గమనించి ప్రోత్సహించారు. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్‌’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను.  నా 75వ చిత్రం ‘సైంధవ్‌’ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందర్నీ అలరిస్తుంది.  నా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పది. చిరంజీవి గారితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా’ అన్నారు.

దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ‘వి అంటేనే విక్టరీ అనే డైలాగ్‌తోనే వెంకటేశ్‌ ప్రయాణం మొదలైంది. అందుకు తగ్గట్టే తన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకే వెంకటేశ్‌ని తెరకు పరిచయం చేశా. తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలు, పాత్రలు, తన అన్నయ్యే కారణం. ఇన్ని రకాల సినిమాలు మరే హీరో చేయలేడేమో అనేలా ఆయన కెరీర్‌ కనిపిస్తుంది’ అన్నారు.

నాని మాట్లాడుతూ .. ‘అందరి అభిమానులు ప్రేమించే హీరో వెంకటేశ్‌. తెరపైనా, తెరవెనుక ఆయన జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి నటుడి కుటుంబం వెంకటేశ్‌లా ఉండాలని కోరుకుంటుంది’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement