‘‘ప్రభుదేవాగారు చేసిన ‘వెన్నెలవే.. వెన్నెలవే’ (‘మెరుపు కలలు’ సినిమాలోనిది) పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ తరహా పాటను నేనూ చేయాలని కల కనేవాడిని. ఆ అవకాశం ధనుష్‌గారి ‘తిరుచిత్రాంబలమ్’తో దక్కింది. అక్కడ (తమిళం) ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు ధనుష్‌గారు నన్నే పిలిపించారు’’ అని జానీ మాస్టర్ అన్నారు. ఇటీవల 70వ జాతీయ సినీ అవార్డ్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ అవార్డ్స్‌లో కొరియోగ్రఫీ విభాగంలో ‘తిరుచిత్రాంబలమ్’ సినిమాలోని ‘మేఘం కరుక్కుద’ పాటకు గాను జాతీయ అవార్డు గెల్చుకున్నారు జానీ మాస్టర్. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు చిత్ర ప్రముఖుల సమక్షంలో సన్మానం జరిగింది. జానీ మాస్టర్ మాట్లాడుతూ– ‘‘మేము ఇలాంటి విజయాలు సాధిస్తున్నామంటే అందుకు ముక్కురాజు మాస్టర్, డ్యానర్స్ అసోసియేషన్ నాయకుల కృషే కారణం.
ఎన్నో అవమానాలు ఎదుర్కొని మద్రాస్ నుంచి తెలుగు డ్యాన్సర్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చి, అసోసియేషన్ స్థాపించి నిలబెట్టారు ముక్కురాజు మాస్టర్. ఆ పెద్దలు వేసిన బాటలో మేమంతా ముందుకెళ్తున్నాం’’ అని తెలిపారు. ‘‘నేను, గణేశ్, జానీ... ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది’’ అన్నారు శేఖర్ మాస్టర్.
Comments
Please login to add a commentAdd a comment