సాక్షి, హైదరాబాద్: శివ శంకర్ మాస్టర్ సాక్షాత్తు ఆ నటరాజు రూపంగా అభిమానులు భావిస్తారు. డ్యాన్స్‌మీద ప్రేమ వ్యామోహంతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పట్టుదలగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కరియర్ ఆరంభంలో ప్రముఖ కొరియాగ్రాఫర్లు సలీం, సుందరం లాంటి వారి దగ్గర అసిస్టెంట్ మాస్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత కొరియాగ్రాఫర్‌గా తనదైన శైలిలో రాణించారు. అలా సుమారు నాలుగున్నర దశాబ్దాలు పాటు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
కొరియాగ్రాఫర్, నటుడుగా, బుల్లితెరపై జడ్జ్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే తన ఆహార్యం, వేషధారణ, దుస్తులపై వచ్చిన విమర్శలను కూడా చాలా సున్నితంగా తిరస్కరించేవారు. తను కళకు అంకితమైన వాడిననీ వృత్తిపరంగా తాను చేయాల్సిందంతా చేశానని చెప్పేవారు. నృత్యమంటేనే అర్దనారీశ్వరత్వం అది ఉంటేనే నృత్యానికి అందమనీ, ప్రేక్షకుల అభిమానం, వారి ఆదరణే తనకు ముఖ్యమని, వారుచెందే గొప్ప అనుభూతే తన కళకు సార్థకమని గర్వంగా ప్రకటించారు శివ శంకర్ మాస్టర్.
అంతేకాదు అసిస్టెంట్ డ్యాన్స్‌మాస్టర్‌గా తనకు అందుకున్న రెమ్యునరేషన్ 7.50 రూపాయలట. ఈ విషయాన్ని శివ శంకర్ మాస్టారే స్వయంగా వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో. అంతేకాదు తెలుగు పరిశ్రమే తనను ఉద్ధరించిందనీ, టాలీవుడ్ తనంటూ ఒక స్థాయిని తెచ్చిపెట్టిందంటారు శివ శంకర్. కాగా లెజెండరీ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచినసంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment