ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సీఎం జగన్ మార్క్ | CM YS Jagan Birthday Special: CM Jagan Mark On The Development Of Film Industry In AP - Sakshi
Sakshi News home page

CM Jagan Birthday Special: ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సీఎం జగన్ మార్క్

Published Wed, Dec 20 2023 5:02 PM | Last Updated on Thu, Dec 19 2024 3:44 PM

CM YS Jagan Birthday Special: CM Jagan Mark On The Development Of Film Industry In AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖపట్నం సినీ పరిశ్రమ కేంద్రంగా వర్ధిల్లుతుందని అందరూ ఆశించారు. విభజన ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సినిమా పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి కార్యచరణ ప్రారంభించలేదు. బాబు అధికారంలోకి వచ్చాక ఆయనకు అనుకూలంగా ఉండే సినీపెద్దలు విశాఖలోని భూములపై కన్నేశారు. ఆపై ఏపీలోని సినిమా థియేటర్ల లీజులు, క్యాంటీన్ కాంట్రాక్టుల, టికెట్‌ ధరలు ఇలా అన్నీ బాబుగారి మిత్రులుగా కొనసాగిన కొందరి గుప్పెట్లోకి వెళ్లాయి. దీంతో ఏపీలో సినిమా పరిశ్రమ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు.  2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి విషయంలో తొలి అడుగులు పడ్డాయి. సినిమా టికెట్ల ధరలు, బెన్‌ఫిట్‌ షోలు, ఏపీలో ప్రతి సినిమా షూటింగ్‌ కార్యక్రమాల పనులు, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం ఇలా అనేక నిర్ణయాలను సీఎం జగన్‌ తీసుకున్నారు. 

 

మొదటి స్టూడియో విశాఖలోనే
సాగర తీరాల్లో ప్రపంచంలో ఎన్నో నగరాలు కొలువుదీరినా వాటిలో విశాఖ నగరానిది ప్రత్యేక స్థానం. ఇక్కడి సాగరతీరం.. పచ్చని కొండలు.. పర్యాటక ప్రాంతాలు పర్యాటక రంగానికే కాకుండా.. సినీ షూటింగులకూ స్వర్గధామాలు. అందువల్లే ఇక్కడ ఆంధ్రా సినీటోన్ పేరుతో 1936లోనే ఒక స్టూడియో ఉండేది. ఇది రాష్ట్రంలో రెండవది. అప్పటికే రాజమండ్రిలో దుర్గ సినీ టోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. విశాఖలో సినీ స్టూడియో నిర్మించి నగరంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్నాధరాజు భావించారు. ఆయనతో సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి ఆంధ్రా సినీ టోన్ స్టూడియోను పూర్తి చేశారు.

కానీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని హైదరాబాద్‌ కావడంతో సినిమా రంగానికి చెందిన వారందరూ కూడా ఆనాడు హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో విశాఖ వెనుకపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు  అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఇండస్ట్రీలో బాబుగారికి భజన చేసే బ్యాచ్‌కు పెత్తనం అప్పజెప్పడం..  ఆపే వారికి మాత్రమే భూ కేటాయింపులు చేసే ప్రయత్నాలు చేయడం వంటివి జరిగిపోయాయి. భూములు పొందిన వారు అక్కడ సినీ పరిశ్రమ బాగు కోసం కాకుండా వారి స్వలాభం కోసమే ఉపయోగించుకున్నారు.

విశాఖలో స్టూడియోలు, ఇల్లు నిర్మాణలకు స్థలాల కేటాయింపు  
విశాఖలో చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేయాలని అధికారంలోకి వచ్చిన రోజు నుంచే జగన్‌ ప్రభుత్వం అడుగులేసింది. విశాఖకు రావాలని సినీ ఇండస్ట్రీ పెద్దలను ప్రత్యక్షంగానే సీఎం జగన్‌ కోరారు. ఆ సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌ బాబు,ప్రభాస్‌,రాజమౌళి, ఆర్‌. నారాయణ మూర్తి, కొరటాల శివ వంటి వారితో సినిమా పరిశ్రమ గురించి చర్చించారు. అపై ఇక్కడే స్టూడియోలు నిర్మించాలని ఆయన కోరారు. అలా ఎవరైనా ముందుకు వస్తే వారికి భూములు కేటాయిస్తామని ఆయన ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఈమేరకు  విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని అప‍్పట్లో ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బహిరంగానే ప్రకటించారు.

సింగిల్‌ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులను మంజూరు చేశారు. ఏపీలో షూటింగ్‌ జరుపుకుంటున్న పలు టాలీవుడ్‌ చిత్రాలు ప్రభుత్వం నుంచి ఇతర ప్రోత్సాహకాలను కూడా అందుకుంటున్నాయి. విశాఖలో సినీ ప్రముఖులు ఉంటామంటే ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ విధంగా వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సినీ కార్యకలాపాలు మొదలుపెడితే విశాఖలో మరో ఫిలిమ్‌నగర్‌, జూబ్లీ హిల్స్‌ లాంటి ప్రాంతాలు తయారవుతాయని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమిలి బీచ్‌రోడ్డు నిడిగట్టు పంచాయతీలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 316 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ భూములు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే..

సినిమా టిక్కెట్‌ రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయం
సినిమా టిక్కెట్‌ రేట్ల పెంపు విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే.  సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌ 11న ఒక మెమో కూడా జారీ చేసి ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోషకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఖర్చు కలిపి ఒక సినిమాకు బడ్జెట్‌ రూ.100 కోట్లు దాటాలి.

ఆ సినిమా షూటింగ్‌లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్‌ అకౌంటెంట్‌ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్‌ రిటర్న్‌లు, ఇన్వాయిస్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు సమర్పించాలి. మొత్తం ఇలా 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలను ఏపీ ప్రభుత్వం పెట్టింది.

అలా నిర్మించిన సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వచ్చేలా నిబంధనలు పెట్టింది. లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్ల రేట్లు ఉండాల్సిందే.  ఇందులో భాగంగా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. బెనిఫిట్‌ షోల పేరుతో ప్రజల డబ్బుల్ని దళారుల రూపంలో దోచుకుంటున్న వ్యవస్థను క్లోజ్‌ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సామన్య ప్రజల నుంచి సానుకూలత లభించింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన తర్వాత కొందరు హీరోలు సైతం వారి స్వలాభం కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. టికెట్ల ధరలు తగ్గించడం వల్ల చిన్ని సినిమాలకు మేలు జరుగుతుందని పలువురు నిర్మాతలు బహిరంగంగానే ఒప్పుకున్నారు. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే సినిమా చూసేందుకు మరికొందరు థియేటర్‌కు వస్తారు.. లేదంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఆలోచించడం సహజం.

ఆన్‌లైన్ టికెట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం
ఆన్‌లైన్ టికెట్ల యవ్వారంలో గోల్‌మాల్ సాగుతోందని చాలా ఏళ్ల నుంచి విమర్శలు ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చే సమయానికి  ఏపీలో డిస్ట్రిబ్యూషన్ మాఫియా బలంగా ఉంది. చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు. ఎంతసేపూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలే. ఏపీలో షూటింగులు చేయడం లేదు. ఎపీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీ లేకుండా పోయింది. దీంతో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థపై గురిపెట్టారు. ఓ నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి ఏపీలో షూటింగ్‌ జరగాల్సిందే అని కొన్ని షరతులు తీసుకురావడం జరిగింది. రైల్వే ఆన్‌లైన్ ట్రాకింగ్ లాగే సినిమా టికెట్లకూ ఓ పద్థతి ఉండాలని ఆయ సంబంధించిన శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు బుక్‌ మై షో వంటి ప్రైవేటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్‌లైన్‌ టికెట్‌ అమ్మకాలు కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం(గేట్‌వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసింది.

ఈ విధానంలో ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్‌ ఎగరగొట్టడం వంటివి జరగవు. దీంట్లో ప్రభుత్వానికి మాత్రమే కాకుండా సినిమా రంగానికి కూడా మంచిదేనని అభిప్రాయాలు కూడా వచ్చాయి. తప్పుడు కలెక్షన్ల రిపోర్టులు, టికెట్‌లు కోసేసి, తప్పుడు కలెక్షన్లు చూపించేసి, సినిమాలకు ఇబ్బడిముబ్బడి లాభాలు వచ్చాయిని దొంగ లెక్కలు చూపించి, ఆపైన నిర్మాతల దగ్గర హీరోల రెమ్యూనిరేషన్ భారీగా పెంచేయడం అనే పని ఇకపై జరగదని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించగలిగితే, పన్నులు కచ్చితంగా అందడంతో పాటు సినిమా లెక్కలు కూడా కరెక్ట్‌గా ఉంటాయనేది అందరి ఆలోచనకు తగినట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 సీనీ పరిశ్రమకు సీఎం జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోని 24 విభాగాలను విశాఖలో స్థిరపడేలా చేస్తే రాష్ట్రానికి, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలుగుతుంది.

విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్‌ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ చిత్రాల నిర్మాణ కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ కలసికట్టుగా ముందడుగు వేయాల్సి ఉంది. 

గతంలో సీఎం జగన్‌ను కలిసిన సినీ పెద్దలకు అడిగిందే తడవుగా షూటింగులకు అనుమతులివ్వడమే కాకుండా, ఇంకేం కావాలో చెప్పండని సీఎం వైఎస్‌ జగన్‌ అడిగి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.  

► సినిమా రంగానికి చెందిన వారికి నివాస స్థలాలు ఇస్తామని సీఎం జగన్‌  ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement