కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ చాలామంది పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు మాత్రమే గుప్తదానాలు చేస్తుంటారు. అలాంటివారిలో నటుడు డేనియల్ ఒకరు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా చేయి చాచి అడిగితే చాలు క్షణం ఆలోచించకుండా సాయం చేసేవారు. తను కూడబెట్టిన డబ్బునంతా ఓ గుడి కట్టేందుకు ఉపయోగించారు. తనకంటూ పెద్దగా ఆస్తులు వెనకేసుకోలేదు.
రియల్ హీరో..
సినిమాల్లో విలన్‌గా నటించినా నిజ జీవితంలో మాత్రం హీరోగా బతికారు. ఇంకా ఎంతో జీవితం చూడాల్సిన వ్యక్తి శుక్రవారం (మార్చి 29) గుండెపోటుతో కన్నుమూశారు. అతడి మరణం తమిళ చిత్రపరిశ్రమను కుదిపేసింది. నటుడి కెరీర్ విషయానికి వస్తే.. చిట్టి అనే సీరియల్‌తో తన నటప్రస్థానం మొదలైంది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. స్క్రీన్‌పై విలనిజం పండించే ఈయనకు మనసులో ఎప్పుడూ ఓ కోరిక మెదులుతూ ఉండేది. తనకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాడని అంటుంటారు. 2014లో తమిళంలో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.
ఆ కోరిక తీరకుండానే..
ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 'స్క్రిప్ట్ రెడీ అయింది. దీన్ని డైరెక్ట్ చేయడంతోపాటు ఓ ముఖ్య పాత్రలో నేను నటించాలనుకుంటున్నాను. వీలు కుదిరితే తమిళంతోపాటు కన్నడ భాషలోనూ ఒకేసారి రూపొందించాలని చూస్తున్నాను. ఈ మూవీకి నా స్నేహితుడు ఎమ్‌ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు' అని చెప్పారు. ఎందుకోగానీ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. డేనియల్.. సాంబ, ఘర్షణ,చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment