‘‘2021ని ఇరగదీయాలని డిసైడ్ అయి, ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సంవత్సరం మ్యూజికల్‌గా నాకు అద్భుతంగా ఉంటుంది. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్) లో కొత్త వెర్షన్‌ని చూస్తారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘ఉప్పెన’. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.
► ‘ఉప్పెన’ పాటలు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్‌లో ఉండడం ఎలా అనిపిస్తోంది?
అందరూ ఈ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ‘మీ మ్యూజిక్ వల్లే సినిమాకు ఈ రేంజ్ వచ్చింది’ అని టీమ్ అందరూ చెప్పడం అన్నింటికంటే సంతోషమైన విషయం. ఈ క్రెడిట్ టీమ్‌కే దక్కుతుంది. బుచ్చిబాబు మంచి కథ చేశాడు. దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాను నేను.
► మీరు ప్రేమకథలకు సంగీతం ఇచ్చి చాలా రోజులైనట్టుంది?
అవును. కెరీర్ ప్రారంభంలో వరుసగా లవ్‌స్టోరీ సినిమాలు చేశాను. ఇప్పుడు ప్రేమకథా సినిమాలే తగ్గిపోయాయి. పెద్ద కమర్షియల్ సినిమాలు, కొత్త కాన్సెప్ట్ సినిమాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే వస్తున్నాయి. ప్రేమకథలు రావాలి. ‘ఉప్పెన’ మంచి ప్రేమకథ. వరుసగా కమర్షియల్ సినిమాలు, టాప్ స్టార్స్ సినిమాలు చేస్తున్న నాకు ‘ఉప్పెన’ మంచి రిలీఫ్‌లా అనిపించింది. ఈ కథ, కథనం ఫ్రెష్‌గా అనిపించాయి. ఈ సినిమా తర్వాత నేను చేసిన నితిన్ ‘రంగ్ దే’ కూడా పూర్తిస్థాయి ప్రేమకథే.
► సినిమాలో దర్శకుడు సుకుమార్ అసోసియేట్ అయితే మీ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోతుంది. ఏంటా సీక్రెట్?
సుకుమార్ ఆలోచనా విధానమే కొత్తగా ఉంటుంది. ఆయన కథలు కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కొత్త సబ్జెక్ట్ మీద ఎవరు పని చేసినా డిఫరెంట్ మ్యూజిక్కే వస్తుంది. అది మొదటి విషయం. రెండోది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం, ఒకరినొకరం అర్థం చేసుకున్న విధానం. సుక్కు నా అన్నయ్య. ‘పుష్ప’ పని మీద వచ్చినప్పుడు బుచ్చిబాబును తీసుకొచ్చి ‘ఉప్పెన’ కథ వినిపించాడు సుక్కు.
► లాక్‌డౌన్‌లో ఏం చేశారు?
లాక్‌డౌన్‌లో ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా బిజీగా ఉన్నారంటే అది నేనే అనుకుంటాను. ‘ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసినప్పుడు కూడా కనిపించేవాడివి, ఇప్పుడు కనిపించడం కూడా లేదు కదరా’ అనేవారు మా అమ్మ. ఇంతకు ముందు చేయడానికి కుదరనవన్నీ లాక్‌డౌన్‌లో చేశాను. యూట్యూబ్‌లో చూస్తూ యావిడ్ (ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్) చాలా త్వరగా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏం నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. సరిగ్గా వాడుకోవాలే కానీ చాలా చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటావా? నాశనమైపోతావా నీ ఇష్టం. నాకు ఫొటోగ్రఫీ చాలా ఇష్టం. కెమెరాలు చాలా కొనిపెట్టుకున్నాను. అవన్నీ బయటకు తీశాను. డ్రోన్ కెమెరా నేర్చుకున్నాను. పాటలు రాస్తూ, పాటల ఐడియాలు రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు మ్యూజిక్ ఇచ్చే కిక్ ఇంకేదీ ఇవ్వదు. వీడియో కాల్స్‌లో సినిమా పాటల రికార్డింగ్ చేశాను. భవిష్యత్తుకి సంబంధించి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ మెల్లిగా చెబుతాను.
► పెళ్లి విషయం కూడా చెబుతారా?
ఆ ఒక్కటీ అడక్కండి (నవ్వుతూ).
► లాక్‌డౌన్ చాలా నేర్పింది అని చాలా మంది అన్నారు. మీరు నేర్చుకున్న విషయాలు?
లాక్‌డౌన్‌లో నేను ముఖ్యంగా తెలుసుకున్న విషయాలు రెండు. ఒకటి.. టైమ్ చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. రెండోది.. మనల్ని ప్రేమించేవాళ్లకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఈ రెండూ జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. ఆరోగ్యం జాగ్ర త్తగా చూసుకోవాలి.
► మీరు ట్యూన్స్ చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తారట..
దర్శకుడు ట్యూన్ చెబుతున్నప్పుడు ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది వాయిస్తుంటాను. చాలాసార్లు ట్యూన్స్ అలానే ఒకే అవుతాయి. ట్యూన్స్ అవలీలగా ఇచ్చినా దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. చాలా సంవత్సరాల కృషి ఉంటుంది. చిన్నతనం నుంచి నేర్చుకున్న సంగీతం, పడ్డ తపన ఆ సందర్భంలో ఉపయోగపడతాయి. అవుట్‌పుట్ త్వరగా వచ్చినంత మాత్రాన ఈజీ అని కాదు. బిడ్డను కనడం అరగంట పనే కదా అనేయగలమా? పది నెలల శ్రమను తీసివేయలేం కదా. ఇది కూడా అలానే.
Comments
Please login to add a commentAdd a comment