టాలీవుడ్‌లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నిర్మించిన అనుభువం దిల్ రాజుకు ఉంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా ఆయన బ్యానర్ నుంచి విడుదల అయ్యాయి. ఈ క్రమంలో కొత్త వారికి కూడా ఆయన భారీగానే అవకాశాలు కల్పించారు. అయితే, తాజాగా ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమలో పాల్గొన్న దిల్ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని దిల్‌రాజు కామెంట్ చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యాలు అందరినీ ఆలోచించే విధంగా చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. కానీ, వారిలో ఎక్కువగా ఫెయిల్ శాతమే ఉంటుంది. ఈరోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అంత సులభం కాదు. ఒక్కప్పుడు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి అంటే ఇంకా ఏమేమి యాడ్ చేయాలని నేను కూడా ఆలోచించేవాడిని. నా వరకు అయితే ఆ పరిస్థితి లేదు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో కొత్త వారికి మాత్రం బిగ్ ఛాలెంజ్‌గా మారింది.
మేము తీసిన బలగం, కమిటీ కుర్రోళ్ళు ప్రేక్షకులను మెప్పించాయి. ఇదే సమయంలో రివ్యూస్ ఇచ్చే వారు కూడా మంచిగానే ఇవ్వడంతో మాకు ఇంకా కలిసొచ్చింది. అసలు ప్రేక్షకులను థియేటర్‌ల వరకు రాకుండా చెడగొట్టింది మేమేలెండీ.. సినిమా విడుదలయ్యాక నాలుగు వారాలు ఆగండి ఆ తర్వాత ఓటీటీలోకి తెస్తాము.. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని మేమే చెడగొట్టాం. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాశారు. ఇప్పుడు వీళ్ళు సినిమా (రేవు) తీశారు. కాబట్టి వీళ్ళ సినిమా (రేవు) చూసి నేను రివ్యూ రాస్తా’ అని అన్నారు.
50 రోజుల షరతు
ప్రస్తుతం దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగుతుంది. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు. సినిమా విడుదలయ్యాక కనీసం 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని పలు షరతులు ఉన్నప్పటికీ ఎవరూ వాటిని పాటించడం లేదు. అన్ని చిత్రపరిశ్రమలలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది.
వాటి రేట్లు తగ్గిస్తేనే మనుగడ
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. టికెట్ ధరలుతో పాటు పార్కింగ్, బ్రేక్ టైమ్‌లో తినుబండారాల ధరలు తారాస్థాయిలో ఉంటున్నాయి. మరికొన్ని థియేటర్‌లలో అయితే, నీళ్ల బాటిల్ కొనాలన్నా రూ. 100 చెల్లించాల్సిందే. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే కనీసం రూ. 2 వేలు ఖర్చు చేయాల్సిందే. ఇవన్నీ కాస్త తగ్గిస్తే సామాన్యుడు కూడా థియేటర్‌లో అడుగుపెట్టి సినిమా చూస్తాడు. లేదంటే రాబోయే రోజుల్లో థియేటర్ అనే పేరును కూడా మరిచిపోయే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment