'గేమ్‌ ఛేంజర్‌' కోసం సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తా: దిల్‌ రాజు | Dil Raju Will Again Meet Telangana CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

'గేమ్‌ ఛేంజర్‌' కోసం ఆ ఆశతో సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తా: దిల్‌ రాజు

Published Mon, Jan 6 2025 11:08 AM | Last Updated on Mon, Jan 6 2025 1:21 PM

Dil Raju Will Again Meet Telangana CM Revanth Reddy

తెలంగాణలో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా టికెట్ల ధరల పెంపుపై  ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చిత్రానికి తెలంగాణలో కూడా టికెట్‌ ధరలు పెంపు కోసం ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డిని (Revanth Reddy) మరోసారి కలుస్తానని తెలిపారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారేమోనని ఆశిస్తున్నట్లు దిల్‌ రాజు పేర్కొన్నారు.

చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కూడా చాలా ముందు చూపుతో ఉన్నారు కాబట్టి ఒక నిర్మాతగా  టికెట్ రేట్ల పెంపుపై తన ప్రయత్నం చేస్తానని దిల్‌ రాజు అన్నారు. టికెట్ రేటు పెంచడం వల్ల 18 శాతం ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి కూడా అందుతుందని ఆయన గుర్తు చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు ప్రభుత్వాల నుంచి సహాయం ఉండాలని ఆయన కోరారు. ఈ విషయంలో గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశాయి అన్నారు. 

(ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ రెడ్డిని మరిచిపోయిన మరో తెలుగు హీరో)

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటూ అన్నీ ఇస్తాను అన్నారు.  ఆ ఆశతోనే మళ్లీ ముఖ్యమంత్రిని కలుస్తానని దిల్‌ రాజు అన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అందుకోసం బడ్జెట్‌ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేడు టాలీవుడ్‌ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందని ఆయన అన్నారు.

 మరణించిన వారి కుటుంబ సభ్యులకు దిల్‌ రాజు సాయం
రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటున్న క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు  కోల్పోయారు. వారిద్దరూ కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఈ ఘటనపై నిర్మాత దిల్‌ రాజు విచారం వ్యక్తం చేశారు.  ఆ రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేసి ఆదుకుంటానని ఆయన ప్రకటించారు. భవిష్యత్‌లో కూడా వారికి అండగా నిలుస్తానని దిల్‌ రాజు చెప్పారు.

ఏపీలో గేమ్‌ ఛేంజర్‌ టికెట్‌ ధరలు ఇలా
రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో నిర్మాత దిల్‌ రాజ్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్‌ షో వేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి ఒక్కో టికెట్‌ ధర రూ.600గా నిర్ణయించింది. అయితే, మొదటి రోజు 4గంటల ఆట నుంచి టికెట్‌ ధరలు ఇలా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.175, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.135 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. ఫస్ట్‌ డే నాడు ఆరు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ రోజుకు 5 షోలు ఉండనున్నాయి. పెంచిన ధరలు 23వ తేదీ వరకు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement