‘‘సెట్స్‌లో నేను ఫ్యాన్ బాయ్‌లా ఉండను. అలా ఉంటే కొన్ని పనులు మనం అనుకున్నట్లుగా సాగవు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ గార్లతో వర్క్ చేశాను. ఇద్దరూ పని రాక్షసులు. వీరికి అపారమైన అనుభవం ఉంది. పొగడ్తలతో మాట్లాడితే మన అంతరంగాన్ని కళ్లతోనే కనిపెట్టేస్తారు. కాబట్టి నేను సెట్స్‌లో ఓ దర్శకుడిగా నిజాయితీతోనే ఉండాలనుకుంటాను. అప్పుడు మనపై గౌరవం పెరుగుతుంది.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్ల వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు బాబీ కొల్లి. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు (ఆదివారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు బాబీ చెప్పిన విశేషాలు...
⇒ డాకు మహారాజ్‌గా సీతారామ్ ఎలా మారాడు? అన్నది ఈ సినిమా కథనం. బాలకృష్ణగారి ఇమేజ్, ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకునే ‘డాకు మహారాజ్’ కథ రాయడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణగారిని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ‘నరసింహనాయడు, సమరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత నాకు బాలకృష్ణగారి ‘సింహా’ అంటే చాలా ఇష్టం. ‘సింహా’లో బాలకృష్ణగారు డాక్టర్ రోల్‌ను చాలా సెటిల్డ్‌గా చేశారు
⇒ ‘డాకు మహారాజ్’ చిత్రంలో హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ల పాత్రలతో పాటు ఓ చిన్న పాప రోల్ కూడా కీలకంగా ఉంటుంది. ఓ విధంగా ఈ పాప చుట్టూనే కథ తిరుగుతుంది. అయితే మరో హీరోయిన్ చాందినీ చౌదరి సీన్స్ కొన్ని ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఆమెకు తెలియజేశాం. ఆమె ఏమీ అభ్యంతరం తెలుపలేదు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌గారు మంచి రోల్ చేశారు.
⇒ మంచి కథ రాసుకోవడం, సీరియస్ స్క్రీన్‌ప్లేని డీల్ చేయడంలో నేను బాగా చేస్తాననే పేరు తెచ్చుకోగలిగాను. కానీ విజువల్స్ పరంగా నా ప్రతిభ గురించి ఆడియన్స్ మాట్లాడుకునేలా చేయలేకపోయానేమో? అనే చిన్న ఆలోచన నాలో ఉండేది. అందుకే ఇప్పుడు ‘డాకు మహారాజ్’ సినిమా విజువల్స్ బాగున్నాయని అంటుంటే హ్యాపీగాఉంది. ‘జైలర్’ డీఓపీ విజయ్ కన్నన్‌గారు ఈ సినిమాకు వర్క్ చేశారు. విజయ్‌గారు కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment