‘‘ఈగల్’ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం ఉంది. అయితే హీరో చేసే విధ్వంసం సమాజం కోసమే. అది ఏంటి? అనేది ప్రేక్షకులకు ఇవాళ తెలిసిపోతుంది. ఈ సినిమాలో పత్తి రైతు పాత్ర చేశారు రవితేజగారు. అయితే ఆయన పోరాడే సమస్య అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. మనకి కూడా దగ్గరగా ఉంటుంది. ‘రాంబో, టెర్మినేటర్’ లాంటి హాలీవుడ్ సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమాలు తీసుకు రావాలనే ప్రయత్నమే ‘ఈగల్’.
అద్భుతమైన యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అన్నారు. రవితేజ హీరోగా, కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించిన ‘ఈగల్’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విలేకరులతో పంచుకున్న విశేషాలు.
► దర్శకునిగా నా తొలి సినిమా నిఖిల్‌తో ‘సూర్య వర్సెస్ సూర్య’ చేశాను. ఆ తర్వాత మళ్లీ కెమెరామేన్‌గా బిజీ అయిపోవడంతో దర్శకునిగా వెంట వెంటనే సినిమాలు చేయలేకపోయాను. రవితేజగారి ‘ధమాకా’ సినిమాకి కెమెరామేన్‌గా చేశాను. ఆ సమయంలో ‘ఈగల్’ కథ ఆయనకి చెప్పాను. వినగానే.. ‘ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం’ అన్నారు రవితేజగారు. దర్శకునిగా ‘ఈగల్’ నా రెండో సినిమా. ముందు నుంచీ యాక్షన్ సినిమాలు చేయడం నాకు ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్‌లో కొన్ని పరిమితులుంటాయి. ఇప్పుడు ‘ఈగల్’తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.
► రవితేజగారు అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. కానీ, కొన్నిసార్లు వాణిజ్య అంశాల కారణంగా ఒకే సినిమాలో కామెడీ, డ్యాన్స్, యాక్షన్.. ఇలా చాలా రకాలు చేయాల్సి వస్తుంది. ‘ఈగల్’లో మాత్రం ఆయన ఒక పాత్రగానే కనిపిస్తారు. ఆ తేడా సినిమా చూసే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఇంటెన్స్‌గా ఉంటూ కూల్‌గా ఉండటం ఆయనలో డిఫరెంట్ క్వాలిటీ. ‘ఈగల్’లో నన్ను నేను చూసుకునే పాత్ర చేశాను’ అని రవితేజగారు అనడం సంతోషం. చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి.. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ. చాలా ఆనందమైన జీవితం గడుపుతారు.
► పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోమ్ బ్యానర్‌లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఒక్క ఫోన్ కాల్‌తో సమకూర్చుతారు. విశ్వప్రసాద్, వివేక్‌గార్లకు కృతజ్ఞతలు. ఈ మూవీలో అనుపమ జర్నలిస్ట్ పాత్ర చేశారు. కావ్యా థాపర్, నవదీప్ పాత్రలకి చాలా ప్రాధాన్యత ఉంది. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఇక హిందీలో ‘ఈగల్’ పేరుతో ఓ సినిమా ఉంది. దీంతో ‘సహదేవ్ వర్మ’ టైటిల్‌తో అక్కడ రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ఓ సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment