కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రపరిశ్రమలో ఎందరో ప్రముఖులు అసువులు బాస్తున్నారు. ఇటీవలే దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్, సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్‌ఆర్ సహా పలువురినీ కరోనా బలి తీసుకుంది. ఈ వరుస విషాదాల నుంచి తేలుకోకముందే తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు రచయిత నంద్యాల రవి (42) కరోనాతో కన్నుమూశారు. కోవిడ్ బారిన పడి కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కాగా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో కమెడియన్ సప్తగిరి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. అలాగే కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) నుంచి కూడా కొంత సహాయం అందినట్లు సమాచారం. కోవిడ్‌ను జయించి తిరిగి వస్తాడనుకున్న నంద్యాల రవి చికిత్స పొందుతూనే మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం పట్ల ప్రముఖ నిర్మాతలు వల్లూరిపల్లి రమేష్ బాబు, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్.. ప్రముఖ దర్శకులు విజయ్ కుమార్ కొండా, నటుడు సప్తగిరి సహా తదితరులు సంతాపం ప్రకటించారు.
రవి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు సమీపంలో సరిపల్లి (గణపవరం పక్కన). అతడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. "నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు" వంటి చిత్రాలతో రచయితగా సత్తా చాటిన రవి 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాతో దర్శకుడిగా సరికొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత విజయ్ కుమార్ కొండా తీసిన 'ఒరేయ్ బుజ్జిగా'తో మరోసారి రచయితగా మారాడు. ఈ మధ్యే వచ్చిన 'పవర్ ప్లే'కు సైతం స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశాడు.
చదవండి: స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ డెన్నిస్ జోసెఫ్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment