
‘‘హను–మాన్’ చిత్రాన్ని చిన్నదిగా స్టార్ట్ చేశాం. అయితే మా మూవీ హనుమంతుని వలే భారీ ప్రాజెక్టు అయ్యింది. మేము హనుమంతుణ్ణి, కథని నమ్మాం. అద్భుతమైన విజువల్ ట్రీట్‌గా రూపొందిన ‘హను–మాన్’ అందరి అంచనాలు అందుకుంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
నేడు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘తెలుగులో గొప్పదర్శకులు చాలా అద్భుతమైన చిత్రాలు తీశారు. వాళ్ల కంటే నేను బెటర్‌గా తీయలేను. నాకంటూ ఒక యూనిక్ జోనర్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో భాగంగా కొత్త జోనర్స్‌పై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో ‘అ, కల్కి, జాంబి రెడ్డి’ సినిమాలు చేశాను. తర్వాత నాకు ఇష్టమైన సూపర్ హీరో కథతో ‘హను–మాన్’ తీశా.
హనుమంతుని కథలో జరిగిన ఒక కీలక ఘటనని తీసుకొని ఈ మూవీ చేశాం. ‘హను–మాన్’ టీజర్ విడుదలైన తర్వాత రాజమౌళిగారిని కలిశాను. ఆయన ఇచ్చిన సూచనలతో మాకు చాలా సమయం కలిసొచ్చింది. జూలై ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ని(పీవీసీయూ) నా బర్త్ డే కానుకగా నేడు అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘అధీర’ ఫిల్మ్ రూపొందుతోంది. బాలకృష్ణగారితోనూ ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు.