‘‘నేనే కాదు.. ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయే సినిమాలనే తీయాలనుకుంటారు. అందుకే నేను పాత్రలను ప్రేమిస్తూ కథ రాసుకుంటాను. ప్రతి సినిమాను, అందులోని ప్రతి సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా ఎవరూ తీయలేరన్నట్లుగా భావించి తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను. ఓ పదేళ్ల తర్వాత కూడా నా సినిమాలను నా పిల్లలు చూడగలిగేలా, వారు గర్వంగా ఫీలయ్యేలా తీయడానికి కష్టపడుతుంటాను. ఇలాగే ‘లవ్‌స్టోరీ’ తీశాను. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు.
►‘లవ్‌స్టోరీ’ ఓ మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సిన రొమాన్స్, ప్రేమ.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో కుల వివక్ష, స్త్రీ వివక్ష అనే రెండు బలమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ చూపించాను. జనరల్‌గా నా సినిమాల్లో కొత్తవారు ఎక్కువగా ఉంటారు. కానీ ‘లవ్‌స్టోరీ’లో ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసిన ఆర్టిస్టులే ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా నాకు కొంత కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.
►‘లీడర్’ చిత్రంలో కుల వివక్షపై ఓ చిన్న సీన్ ఉంది. ఆ సన్నివేశం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ పాయింట్‌నే కొంచెం ఎక్కువగా చూపిస్తూ ‘లవ్‌స్టోరీ’ తీశాం. శతాబ్దాలుగా ఉన్న కుల వివక్ష సమస్యలకు ఎవరు పరిష్కారాలు చూపించారు? అది మన దౌర్భాగ్యమే. ఒకటో తరగతి పుస్తకాల్లోనే మనమంతా ఒక్కటే అని ఉంటుంది. ఇది చెప్పడానికి ఇంకా ఎన్ని సినిమాలు రావాలి? ఇంకా ఎంత సాహిత్యం కావాలి? కుల వివక్ష గురించి పరిష్కార మార్గాలు కాదు కానీ .. నాకు తెలిసింది, నాకు వచ్చింది నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాను. అలాగే సమాజంలో స్త్రీల పట్ల కనిపించే వివక్ష చూపించాం. ‘లవ్‌స్టోరీ’ చూసిన అమ్మాయిల్లో కొందరైనా ఇది మా కథ అని స్ఫూర్తి పొందినట్లయితే మేం విజయం సాధించినట్లే.
►లాక్‌డౌన్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ చిత్రనిర్మాతలు నాకు బలాన్ని ఇచ్చారు. వేరే నిర్మాతలు అయితే ఓటీటీకి ఇచ్చేసేవారేమో. వీరికి థియేటర్స్ ఉన్నాయని కాదు... సినిమాను థియేటర్స్‌లో చూడాలని, ప్రేక్షకులకు చూపించాలని తపన. లాక్‌డౌన్ ప్రతి ఇంట్లో ఏదో రకమైన విషాదాన్ని నింపింది. ఈ సమయంలోనే మా నాన్నగారు దూరమయ్యారు.
►‘లవ్‌స్టోరీ’లో తెలంగాణ కుర్రాడు రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. జుంబా డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కనిపిస్తాడు చైతు. తెలంగాణలోని ఆర్మూర్ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. ఈ సినిమా కోసం చైతూయే కాదు చిత్రయూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. తెలంగాణ యాస, మేనరిజమ్, డ్యాన్స్ వంటి అంశాల్లో చైతూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొత్త చైతూను చూస్తారు. సాయిపల్లవి మంచి పెర్ఫార్మర్. ‘ఫిదా’లోలానే ఈ సినిమాలోనూ తను బాగా చేసింది. అయితే ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన ‘భానుమతి’ పాత్రకు మౌనిక పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. మౌనిక క్యారెక్టర్‌లో ఓ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్‌లో షేడ్స్ ఉన్నాయి.
►అక్కినేని నాగేశ్వరరావుగారి ‘ప్రేమ్‌నగర్’ విడుదలైన రోజునే ‘లవ్‌స్టోరీ’ విడుదలవుతోందని నాగార్జునగారు అన్నారు. ‘ప్రేమ్‌నగర్’ సక్సెస్ అయిన దాంట్లో 30 శాతం మా సినిమా సక్సెస్ అయినా నేను హ్యాపీ ఫీలవుతాను.
►నా తర్వాతి చిత్రం ధనుష్‌తో ఉంటుంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో అనుకున్నాం. కానీ ఓటీటీల వల్ల ఆడియన్స్ రీచ్ ఎక్కువగా ఉంది. హిందీలో కూడా ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అందుకే మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్‌గా తీస్తున్నాం. రానా హీరోగా నా డైరెక్షన్‌లో వచ్చిన ‘లీడర్’కు సీక్వెల్ చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment