‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్‌కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్‌కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్‌కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్‌కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.
→ రజనీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.
→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్‌కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.
→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.
వెట్టయన్'కి ప్రీక్వెల్‌ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.
→ నిజ-జీవిత ఎన్‌కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.
→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.
→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment