హైదరాబాద్: పంజాబ్‌కు చెందిన ఓ యువతి తెలుగు సినిమాలో అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆ ప్రముఖ వ్యక్తి ఆమెకు అబార్షన్ చేయించి, ఎవరికి చెప్పవద్దని బెదిరించి రూ.5 కోట్లు ఇచ్చారట.. అని తెలిపారు. సినీనటుడు పవన్‌కల్యాణ్ ఏపీ సీఎం జగన్, మంత్రులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన పంజాబ్ అమ్మాయి పేరు పవన్‌కల్యాణ్ చెవిలో చెబుతానన్నారు. ఆ అమ్మాయి పేరు మీడియాకు చెప్పి, ఆ ప్రముఖ వ్యక్తిపై పోరాటం చేసి ఆమెకు న్యాయం చేస్తే ఆయనకు గుడి కడతానని చెప్పారు. ఆ పిల్ల జీవితాన్ని బాగుచేస్తే పవన్ ముందు జగన్ కుడా పనికిరారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి అండదండలు అందించకపోతే పవన్‌కల్యాణ్‌కు ఎవరినీ ప్రశ్నించే అర్హతలేదని చెప్పారు. పోసాని ఇంకా ఏమన్నారంటే..
జగన్‌తో పోల్చుకోవద్దు
పవన్ అంటే ప్రపంచానికి తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు. పవన్.. మీరు జగన్‌తో పోల్చుకోవద్దు. జగన్ రాకముందు గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏమిటి. పవన్ ఏ పార్టీతో సరిగ్గా ఉన్నావు. ఏ పార్టీని మిగిల్చావు. చిరంజీవి సంస్కారవంతుడు, గొప్ప మానవతావాది. ఆయన నోట ఎప్పుడైనా బ్యాడ్ మాట విన్నారా? చిరంజీవిగారి ఇంట్లో ఆడవారిని అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు? నీకు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలియదు. పవన్ తనే ప్రశ్నిస్తాడు, తానే జవాబు చెబుతాడు.
జగన్‌ని, మంత్రుల్ని తిట్టాల్సిన అవసరమేంటి?
రిపబ్లిక్ ఫంక్షన్‌కు వచ్చి సీఎం జగన్‌ని, మంత్రులను తిట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయని జగన్‌ను తిడుతున్నావు? ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకంతో నీకేంటి సంబంధం. జగన్‌కు మత, కుల పిచ్చి ఉందని నిరూపించగలవా? ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లకపోయినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మీరు రెండు నియోజకవర్గాల్లో నిలబడి గెలిచారా.
బాధ్యతతో మెలుగు
చంద్రబాబు పరిపాలనలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుమీదకు లాగారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారా? చంద్రబాబుకు కాపుల మీద ప్రేమ ఉందా? ఎస్సీలుగా ఎవరూ పుట్టాలనుకోరు.. నాయీబ్రాహ్మణుల తోకలు కట్‌చేస్తా.. అని అన్న చంద్రబాబును నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు పవన్‌కల్యాణ్. ఎమ్మార్వో వనజాక్షిని అవమానించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు..’అని పోసాని కృష్ణమురళి నిలదీశారు.
చంద్రబాబు మంచి చేస్తే చేశాడని, చెడుచేస్తే చెడు అని తాను చెప్పానన్నారు. మోదీని కూడా మిమిక్రీ చేసిన పవన్‌కల్యాణ్ మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ బీజేపీతో కలిశాడని చెప్పారు. హిందూ నాయకులను తిడతారన్నారు. ఒక కులం గురించి రాజకీయాలకు రాలేదన్న పవన్ మొన్న కాపుల గురించి ఎందుకు అడిగాడని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ నువ్వు మారవని తెలుసు.. బాధ్యతతో మెలుగు.. అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment