
ముంబై: నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారి రాజ్‌కుంద్రాపై దేశంలోని ప్రసార మాధ్యమాలన్నీ కోర్టుతో పాటు సమాంతర దర్యాప్తు కొనసాగిస్తున్నాయని రాజ్‌కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబ గోపత్యకూ ప్రజలు గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల ప్రైవసీకి భంగం కల్గించొద్దని ఆమె హితవు పలికారు. మీడియా సొంత ‘దర్యాప్తు’కు స్వస్తి పలకాలని, చట్టం తన పని తాను చేయనివ్వండని ఆమె మీడియాను కోరారు.
నీలి చిత్రాలను నిర్మించి, వాటిని ‘హాట్ షాట్స్’ తదితర యాప్‌ల ద్వారా ప్రచారంలోకి తెచ్చారనే ఆరోపణలపై జూలై 19వ తేదీన ముంబై నేరవిభాగ పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బుధవారం ఆయన చేసిన బెయిల్ అభ్యర్థనను దిగువ కోర్టు కొట్టేయడం విదితమే. కుంద్రా అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరెస్టు, అరెస్ట్‌కు కారణాలు, కుంద్రా చట్టవ్యతిరేక చర్యలు అంటూ పలు మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని, దీంతో తన కుటుంబానికి ప్రైవసీ లేకుండా పోయిందంటూ శిల్పా శెట్టి సోమవారం ‘ఇన్‌స్టాగ్రామ్’లో వివరణ ఇచ్చారు.
ముంబై పోలీసులపై, భారత శాసన వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఆరోపణల నుంచి కుంద్రాను విముక్తుణ్ణి చేసేందుకు, శాసనవ్యవస్థ ద్వారా మాకున్న అన్ని సహాయ అవకాశాలను మేం అన్వేషిస్తున్నాం. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తల్లిగా నేను కోరేది ఒక్కటే. అసంపూర్ణ సమాచారంతో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ఆపండి. మా కుటుంబం ప్రైవసీకి భంగం కల్గించొద్దు. సమాంతర దర్యాప్తు చేయకండి. సత్యమేవ జయతే’ అని శిల్ప పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment