
సెలబ్రిటీలు సోషల్ మీడియానే కాదు యూట్యూబ్‌నూ నమ్ముకుంటున్నారు. పర్సనల్ విషయాలను, ఫన్నీ సంఘటనలను, బాధాకర విషయాలను, కొత్త ప్రాజెక్టులను.. ఇలా ప్రతీది యూట్యూబ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా బుల్లితెర నటి అర్చన పూరన్ సింగ్ (Archana Puran Singh)కు సైతం యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మధ్య ఆమె ఓ వీడియో వదిలింది. అందులో తన కుటుంబంతో కలిసి ముంబైలో తమకిష్టమైన దోస హోటల్స్ వద్దకు వెళ్దామంది.
ఫ్యామిలీతో ఫుడ్ వ్లాగ్
అర్చన భర్త పర్మీత్.. చిన్నతనంలో జుహు బీచ్‌లో దొరికే దోస తన ఫేవరెట్ అన్నాడు. అర్చన శివనగర్‌లోని ఓ హోటల్ పేరు చెప్పగా.. కుమారులు ఆర్యమన్, ఆయుష్మాన్ ఇద్దరూ మిథిబాయి కాలేజ్ దగ్గర దొరికే దోస అలాగే అమర్ జ్యూస్ సెంటర్‌లో దిరకే జ్యూస్ అద్భుతంగా ఉంటాయన్నారు. అలా మొదటగా మిథిబాయి కాలేజీ సమీపంలోని దోసల్ని కుటుంబమంతా ట్రై చేసింది. అక్కడ పనిచేసే చెఫ్ నేపాలీవాసి. దీంతో అర్చన.. మసాలా దోసలో ఎక్కువ కారం దట్టించకు.. నేను చెప్పింది చేయకపోతే నిన్ను నేపాల్ పంపించేస్తా అని సరదాగా వ్యాఖ్యానించింది.
చివరగా భర్తకు ఇష్టమైన చోట..
తర్వాత కుటుంబమంతా శివ్ నగర్‌కు వెళ్లి అక్కడ దోసను తిన్నారు. అనంతరం అమర్ జ్యూస్ సెంటర్‌లో ఫేమస్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగారు. చివరగా భర్తకు ఇష్టమైన దోస కోసం జుహు బీచ్‌కు వెళ్లారు. అక్కడ తనకు ఇష్టమైన హోటల్‌ను వెతకడానికి కాస్తంత సమయం పట్టింది. చివరకు అది ఎట్టకేలకు కనిపించడంతో పర్మీత్ ఎగిరి గంతేశాడు. వాళ్లు దోసను ఆస్వాదిస్తుంటే అక్కడున్న జనాలు అర్చనతో ఫోటో దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమెకు ఓ ఐడియా తట్టింది.
నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా?
మాకు దోస వేసిచ్చినందుకు బదులుగా నీకు సెల్ఫీ ఇస్తాను అంది. ఆమె ఐడియా అతడికి ఏమాత్రం నచ్చలేదు. తనకు డబ్బులే కావాలన్నాడు. అందుకు షాకైన అర్చన.. నా సెల్ఫీ రూ.100 కూడా విలువ చేయదా? అని అడిగింది. ఆ హోటల్ వ్యక్తి.. సెల్ఫీ కావాలి, అలాగే డబ్బు కూడా కావాలన్నాడు. సరే, భయపడకులే.. నేను డబ్బివ్వకుండా ఎక్కడికీ పారిపోను అని చెప్పింది. ఇక అందరికీ ఈ చివరి స్టాల్‌లోని దోసెనే నచ్చింది.