‘‘మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. ‘మహానటి, సీతారామం’ సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు’’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్స్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.
ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘లక్కీభాస్కర్’ సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను.
ఆ అడ్వెంచర్‌ను వెంకీ సక్సెస్‌ఫుల్‌గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లిచూపులు’ సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్‌గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు ‘వీడీ 12’ సినిమా చేస్తున్నాను. ‘లక్కీ భాస్కర్’ను వెంకీ బాగా తీశాడనిపించింది. ‘మహానటి, కల్కి 2898 ఏడీ’ సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్స్ షేర్ చేసుకోలేదు. ‘లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘నాకు నచ్చిన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ ఒకటి. త్రివిక్రమ్‌గారి రైటింగ్‌లో మంచి డెప్త్ ఉంటుంది.
విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘మహానటి’ ఈవెంట్‌లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్ కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ ఈవెంట్‌లో ఉన్నాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ ఈవెంట్‌లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్‌లోని పాత్రలు మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు’’ అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్స్ . ‘‘బ్యాంకింగ్ వరల్డ్‌పై సినిమా తీయాలని ‘లక్కీ భాస్కర్’ తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment