కొందరికి గ్లామరస్ పాత్రలో నటించాలనే కోరిక ఉన్నా, నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలే వస్తుంటాయి. అలాంటి వారిలో నటి దుషారా విజయన్ ఒకరు. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన నటి ఈమె. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడు దర్శకుడు పా.రంజిత్ దృష్టిలో పడ్డారు.
అలా ఆయన దర్శకత్వంలో ఆర్య కథానాయకుడిగా నటించిన సర్పట్ట పరంపరై చిత్రంలో నాయకిగా నటించారు. ఆ చిత్రం విజయాన్ని సాధించడంతోపాటు దుషారా విజయన్ నటనకు ప్రశంసలు లభించాయి. ఆ చిత్రంతోనే ఇలాంటి మంచి నటి ఉన్నారన్నది కోలీవుడ్‌కు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలోనే నక్షత్రం నగరగిరదు చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా దుషారా విజయన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత కళువేత్తి మూర్ఖన్, అనీతి వంటి చిత్రాల్లో నటించారు. విశేషమేమిటంటే ఇప్పటివరకు ఈమె నటించిన కథా పాత్రలన్నీ గ్లామర్‌కు తావు లేకుండా నటనకు అవకాశం ఉన్న చిత్రాలే కావడం గమనార్హం. కాగా ఇటీవల కథ డిమాండ్ చేస్తే గ్లామరస్‌గా నటించడానికి సిద్ధమే అని దుషారా విజయన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు కూడా. అయినప్పటికీ ఈమెకు అలాంటి పాత్రలు రావడం లేదు ఇటీవల ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా ముఖ్యపాత్రను పోషించారు.
తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్ చిత్రంలో కీలకపాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. దీని గురించి దుషారా విజయన్ పేర్కొంటూ వేట్టైయన్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించాల్సి ఉండడంతో ముందురోజే తనకు చలి జ్వరం వచ్చేసిందన్నారు. ఆయనతో కలసి నటించడం తనకు కలగా అనిపించిందన్నారు. ఈ చిత్రంలో తనది చాలా బరువైన పాత్ర అని పేర్కొన్నారు. అదేవిధంగా ఫాహత్ ఫాజిల్ వంటి నటుడితో కలిసి నటించే అవకాశం వేట్టైయన్ చిత్రం కలిగించిందని దుషారా విజయన్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment