టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ తారలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ బుధవారం (సెప్టెంబర్ 22న) ముగిసింది. ఇప్పటికే 11 మంది సినీ ప్రముఖులను విచారించిన ఈడీ అధికారులు, చివరగా నటుడు తరుణ్‌ని ఈడీ కార్యాలయంలో విచారించారు. దీంతో అభియోగాలు ఉన్న 12 మంది విచారణ పూర్తయ్యింది. తరుణ్‌ని దాదాపు 8 గంటల పాటు అధికారులు విచారణ చేశారు. తండ్రి, చార్టర్డ్ అకౌంటెంట్‌తోపాటు హాజరైన తరుణ్ బ్యాంకు స్టేట్ మెంట్ ఇతర పత్రాలు వెంట తీసుకొచ్చారు. అయితే ఈ విచారణకు సినీ సెలబ్రిటీలందరూ తమ బ్యాంక్ ఖాతాల వివరాలతో హాజరయ్యారు.
ఆగస్ట్ 31వ తేదీన సినీ ప్రముఖుల విచారణను ఈడీ మొదలుపెట్టింది. మొదటగా పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. అనంతరం వరుసగా ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానాను సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వరుసగా ఈడీ విచారించింది. ఈ సమయంలోనే డ్రగ్ డీలర్ కెల్విన్, అతడి స్నేహితుడు జీషాన్ ఇళ్లలో సోదాలు చేశారు. వారిని ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. సెప్టెంబర్ 9న రవితేజతో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను 6 గంటల పాటు, సెప్టెంబర్ 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను 9 గంటల పాటు ఈడీ విచారించింది. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్‌ను దాదాపు 7 గంటల పాటు ఈడీ విచారించింది. చివరిగా సెప్టెంబర్ 22న తరుణ్ విచారణకు హాజరయ్యాడు. కేసులో బలమైన ఆధారాలు లేవని, సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని ఈడీ పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment