ముంబై : అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంతో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె, ఆమె భర్త, హీరో రణ్‌వీర్ సింగ్‌లు కలిసి ఫొటో దిగారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో దీపికా, రణ్‌వీర్, సందీప్, సంజయ్ లీలా భన్సాలీతోపాటు మరికొంత మంది ఉన్నారు. అయితే ఈ ఫోటో 2013లో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన ‘గోలియోంకి రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలోనిది. అయితే ఇందులో దావుద్ కూడా ఉన్నాడని, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె వెనక వరసలో సందీప్ పక్కన కూర్చున్న వ్యక్తిని దావుద్ ఇబ్రహీంగా గుర్తిస్తూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. (‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’)
ఈ ఫోటోను జస్టిస్ ఫర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, సందీప్ తమ స్నేహితులతో కలిసి దిగిన ఈ ఫొటోలో దావుద్ ఇబ్రహీం కూడా ఉన్నాడంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ను జోడించారు. అయితే ఇదే ఫొటోను సందీప్ సింగ్ ఈ ఏడాది మేలో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఫోటోలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లను కింద పేర్కొన్నారు. దీంతో ఇది వాస్తవం కాదని, ఆ ఫొటోలో దీపికా, రణ్‌వీర్, సంజయ్ లీలా భన్సాలీతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదని తేలింది. సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆర్ వర్మన్‌తోపాటు దావుద్ గా చెబుతున్న వ్యక్తి వాసిక్ ఖాన్‌గా స్పష్టమైంది. వాసిక్ ఖాన్.. బాలీవుడ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రామ్‌లీలా సినిమాకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.
వాస్తవం: దీపికా, రణ్‌వీర్, సందీప్‌లతో ఉన్న వ్యక్తి దావుద్ ఇబ్రహీం కాదు. ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment